కోపం తగది కొడుకా!
కోపగించుకుంట వోతుంటె ఎవలు దగ్గరైతరు?
గుడ్లు దీసుడు..పండ్లు గొర్కుడు..
మీది మీది కచ్చుడు ఎందుకు మంచిదంటవు?
ఎంత ఉర్మి ఉర్మి జూసినా
మాటకు భయపడే కాలం ఎక్కడిది?
మాట అన్నప్పుడు మాట వడాల్సిందే!
బెదిరెటోళ్లెవలు? అంతా ఎదురు మంత్రించేటోళ్ళే..
ఎదురువడి కొట్లాడెటోళ్ళే.. మంది గాదు గదా!
అదిగిచ్చి బుదిగిచ్చి జెప్పుకోవాలె…
కోపమద్దు కొడుకా!
సోకులమారి దినాలు
ఉన్నంతల సంసారం ఎల్లదీసుడెక్కడిది?
అప్పులకు లెక్కలేదు..ఆందానికి లెక్కలేదు…
మనిషిల మంచెవడు జూడచ్చిండు?
ఇప్పుడంతా పైసకే పతారనంట!
కూడవెట్టిన కుప్పలెనున్నా సరే
అచ్చే తావులు ఇడ్సవెట్టరు-
సొచ్చిన తొవ్వల ఇడ్సవెట్టరు-
మాటిననప్పుడే
మర్లవడుతున్నది నిజం..
పెడచెవిన వెడుతున్నడంటెనే..
పెద్దీర్కం పోయినట్టు లెక్క!?
పొలగాండ్లప్పుడు శెయివట్టుకొని
నడిపించినవు.. నడ్క నేర్పినవు..
నల్గుట్ల బత్కనేర్పినవు…
శెప్ప నేర్శినోనికి ఇంకేం సదువు జెప్తవు?
ఎవల మీద కోపం? ఎందుకు కోపం?
శెయ్యిడిశిన పతంగిని యాడికంటే జెప్పస్తదా?
నెత్తురు గలిశిన పానాలు గదా!
నేనరుండాలె కొడుకా! పెంచిన పేగు బిడ్డా!
అడుగడుక్కు ఆగమైతనే ఉంటది..
జరంత ప్రేముండాలె…
గురాతం మర్శినంక గుర్తులెక్కడియి?!
పాతకాలం పాడువడ్డ బాయే గావొచ్చు..
తోడుకుంటవోతే యాన్నో ఊటల దరి దొర్కదా?
ఇప్పుడంతట శేతుళ్ళ మిఠాయి పొట్లం
తిన్నంత సేపు నోరు తియ్యనా…
శెనిగెలు బుక్కి శేతులు కడుక్కున్నట్టు..
లెక్కలన్నీ సుక్త జేసుకున్నట్టు…
ఎవరికి? ఎవరు బాకీ?
అప్పు దీసుక్కన్నోళ్లంత లొట్ట జూపిచ్చుడే!
పంచిన ప్రేమలు గంతే!?
రూపాయి లెక్కలేస్తందుకే….
ప్రేమ ఆత్మ సంబంధం! పేగు సంబంధం!
ప్రేమను జోకే తక్కెడలెక్కడియి బిడ్డా?
ఇచ్చి పుచ్చుకునే వాయినం లెక్కగావద్దు,
మన్సు గుంజాలె గాని..మనిషిని గుంజుతమా?
పేనుకుంటవోతెనే తాడు గట్టితనం
పురిదప్పితే పుట్టుక్కు మంటది!!
– మోతుకూరి అశోక్ కుమార్
9247380976