నాకిప్పుడు
మట్టి కావాలి
ఎవరైనా…, దోసెడు మట్టిని ఇవ్వగలరా?
మనిషిని
మనిషిగా ప్రేమించి
మానవత్వం ఏరులై పారిన
సమానత్వపు అవని మట్టి కావాలి
అధికారపు
ఎత్తుల కోసం
నెత్తురు పారని నేల మట్టి కావాలి
కులాల, మతాల
స్వార్థ రాజకీయాల పార్టీల పంజరాలు లేని
స్వేచ్ఛ దేశపు నేల మట్టి కావాలి
పేదలు, రాజులు
ధనవంతులు, దౌర్భాగ్యులు
ఒక్కటే తొవ్వలో నడిచిన, ఇలలోని మట్టి కావాలి
దీనుల, హీనుల కన్నీరును
పన్నీరుగా తాగని, దోపిడి లేని
పుడమి దోసెడు మట్టి కావాలి
జాలి, దయ, ప్రేమ, కరుణల
గాలి వీచే నేల మట్టి కావాలి
చెమట చుక్కల కండ్లల్ల
ఆత్మగౌరవ సిరులు మెరిసే
ధరణి మట్టి కావాలి
బుద్ధుడు కల కన్నట్టి
యుద్ధాలు జరుగని
శాంతిబోధి వృక్షాలు మొలకెత్తిన
నేల మట్టి కావాలి
ఆకలి చితి లేని
అమ్మల రాజ్యపు గని
విలసిల్లిన భూమి మీద మట్టి కావాలి
దుర్మార్గంతో
వికృత చేష్టలు లేని
ప్రకృతిలో భాగమై సాగిన స్వచ్ఛమైన నేల మట్టి కావాలి
నాకు
దోసెడు మట్టి కావాలి
మహాత్ములెవరైనా సరే తెచ్చి ఇవ్వగలరా
రోజూ కుంకుమబొట్టుగా పెట్టుకుంటాను..
– చిక్కొండ్ర రవి95023 78992