నెరుసును తాగిన పల్లుగోల పొట్ట
మీద పొర్లాడుతున్న చెక్కుడులి
పీర్లకు కుడకలు దట్టీలు గట్టినట్టు జిట్టీదులు
చిలుకలు బత్తీసాలు
ఖర్జూర చెట్లు ఖండచెక్కరలు
చేదు నాదు మీదున్నది
సురసురాంటున్నది
కన్కనం కన్కనం కన్కనం
డన్కనం పున్కణం డన్కనం పున్కణం
రెండు రాళ్ళ పొయ్యి
ఈత ముండ్ల మంట మీద
కుత కుత ఉడుకుతున్న గుడ్లజన
కడుపుల లోట్లను కట్టి
గొంతుకు శిక్కాలను తగిలిచ్చుకొని
నల్ల ఈదు గొంతు గావువట్టి
కండ్లు తెరిసి నిద్రవోతున్న
జజ్జెన్క జజ్జెన్క జజ్జెన్క
ముల్లోకాలు ముప్పైయారు చెట్లకు సాకవోసి
దూప దూప దూప
దూపాని దూలాడుతున్న
పన్నెండు కీసల పట్వల పేరిణి
శీటిగొట్టు..
బోకిల బోనమెత్తిన బొబ్బర్లు
అట్కెల అలిగిపండిన గుడాలు
మారెసరు బుడ్డి మీద
నిద్ర గన్నేరు చెట్ల కింద
గుడ్డిగొరింకలు పసుపుముద్దలు ఉడ్తలు
మొగినిండ ఊటవట్టిన చిలుకలు
దాయి దాయి దాయమ్మా
దాయీ దాయమ్మా దాయీ
దాయమ్మా దాయంటూ
మత్త గొలుపులు పాడుతున్నాయి
కండ్లు తెరిసి నిద్రవోతున్న
జజ్జెన్క జజ్జెన్క జజ్జెన్క
ముల్లోకాలు ముప్పైయారు చెట్లకు సాకవోసి
చిల్లం కల్లం.. డల్లెం బిల్లెం
డడ్డముడ్డల్లెం.. డడ్డముడ్డల్లెం
-విశ్వనాథుల
పుష్పగిరి