వాడ వాడ ఎరిగి
రాజ్యమంత తిరిగి
కట్టిన ముళ్లెలకెంచి
ఇప్పిన పొట్టి కవితలు
చిటపట ఏగుతున్నయ్
గుండెల్ను ఏలుతున్నయ్..
మనిషికి
జాడైతున్నయ్
దారైతున్నయ్
రేవైతున్నయ్..
ప్రతి గొంతుకు
న్యాయ గంటైతున్నయ్..
కండ్లెదురుగ పుడుతున్న
సామాజిక రోగాలకు
కలమిచ్చిన గోళీలయి..
దవాఖానా సీటీ
తీరు గాదు..
పెన్ను వట్టని
కాయిదం ముట్టని
కాలే కడుపులల్ల
తేలిన నరాలల్ల
ఇంకే మందులయి..!
బీడువారిన
తరమేదైనా
ఆ కవిత్వపు జడివానలో
తడిసి మొలకెత్తుడే ఇగ..
రాతలో ఈదుతున్న
పోటుగాళ్ల మెడలో
పూల దండలై
ప్రతి జయంతిల
మురిసివోతది నీ కవిత..!
నిచ్చెన బరువున్న
నీ అస్థిపంజరంతోటి
నిలుచున్న చోటే
కవిత రాసినవేమో..!
పాణాన్ని ప్రేమించక
డబ్బును కామించక
పేదరికాన్ని జయించక
ఎగిసిన అగ్ని జ్వాలవు నీవు
-సురేంద్ర బండారు
90108 47120