పల్లె కరిగిపోయే కొవ్వొత్తి
మెల్ల మెల్లగా సన్నగిల్లిపోతోంది
వనరుల చేయూత కరువైనాక
పంట కాలం కాటు వేసినాక
బ్రతుకు తెరువు కోసం
మూట ముల్లె సర్దుకుంటోంది
పిప్పికాయల దిగుబడి
రైతును వెక్కిరిస్తుంటే
మొహంలో వెల్తురు మాయమైంది
రేటుకు రాని రాశి కన్నీళ్లు పెట్టి
ఓ మూలన ఒదిగిపోయి కూర్చుంటే
కర్షకుని నమ్మకం కొండెక్కిన దీపమైంది
అరువు బరువు నెత్తిన కుంపటై
రేయి పగలు మండిపోతుంటే
దిక్కుతోచని పల్లె పరుగు పెట్టింది
పొయ్యి వెలగని ఇల్లు
చినబోయి దిగులు పడుతుంటే
తలుపులు మూసే స్థితి దాపురించింది
కూటి కోసం కోటి విద్యలు ఉన్నా
సేద్యం తప్ప రెండో మార్గం తెలియక
రైతు లోకం తికమకలు పడుతోంది
కారణం లేని కష్టం కమ్ముకున్నాక
సర్దుకుని పారిపోవడమే గతైపోయింది
చివరికి పల్లె వలసెళ్లిపోతోంది
కళకళలాడే పచ్చదనం పైన
కరువు మచ్చ ఏర్పడినాక
ఫలితం లేని ఫలాలను నమ్మలేక
మట్టిని అమ్ముకునే గతి తోడైంది
గూడొదిలిన గువ్వల జాడ
పశుసంపద లేని పల్లె పరిస్థితిని
చూడలేని రైతుకు దుఃఖమే
చివరికి స్నేహమై వెంట నడిచింది
ఉసూరుమంటూ పల్లె సీమ
రెక్కలు ముడిచి పట్నం చేరిపోయింది
-నరెద్దుల రాజారెడ్డి
9666016636