నువ్వు వస్తున్నావ్
మళ్లీ వస్తున్నావ్
ఏకబిగిన తిరిగిన ఊపిరి చక్రం
అరవై ఐదవ
దృశ్యానికి సిద్ధమవుతోంది
సంధ్యాకాలపు వర్షం లాంటి
ఒక స్ఫురణ ఏదో
గుండెలో నలిగిపోతున్నది
ఎన్ని అరణ్యాలు దాటాను?
ఎన్ని పూల వనాలు స్పర్శించాను?
నాకు ఆవాహన అయిన
ఎన్ని ఉదయపు చిరునవ్వులు
చీకటిలో కలిసిపోయాయి
బతుకు బొంగరం
ఇంత వేగంగా ఎలా తిరిగేస్తున్నది?
నువ్వు చెబుతున్నావ్
శేషమైన నీ కొరకు
నువ్వు కట్టుకున్న
మాల కావాలని
నువ్వు హెచ్చరిస్తున్నావు
ఇప్పటికైనా
జీవనస్నాన వాటికలో
దిగంబరంగా దిగిపొమ్మని ప్రాధేయపడుతున్నావ్
ఇక జనారణ్యాన్ని లెక్కచేయక
తనివితీరా ఏడుస్తాను
ఇక మూల్యంకనాలు లేవు
లాభనష్టాలు అసలే లేవు
నిన్ను ఆలంబన చేసుకొని
పిల్ల బాట కూడా లేని
అడవిగా మారిపోతాను.
(కొత్త సంవత్సరానికి
స్వాగతం చెప్తూ..)
-డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు
96760 96614