మంత్రాల సర్పంచు
దుస్తంత్రాల పట్వారీ
తంత్రాల పటేల్ కుతంత్రాల దొర
ఎవరు చెప్పినా అమ్మను
మా తాత పొర్లాడిండు
మా అయ్య తిరుగులాడిండు
నేనెట్ల అమ్మేది
అమ్మలేనని చెప్పేది
టీకొట్టులో ఛీకొట్టినా
కిరాణా కొట్టులో చివాట్లు
పెట్టినా పరవాలేదు
అమ్మను వెలేయండి
మొలేయండి
అమ్మను
అమ్మడానికి అది
గంటచుట్టా కాదు
అమ్మడానికి అది అగ్గిపెట్టె కాదు
నా పిల్లలు సాలెకి పోయిరి
చదువులు నేర్చిరి కొలువులకి వెళ్లిరి
మమ్మల్ని చల్లంగా చూసిన
భూమిని వదిలేది లేదు
మమ్మల్ని మెల్లంగా సాకిన
భూమిని విడిచేది లేదు
ఏడాదికో శివరాత్రి జాతర
ఏడాదికో నవరాత్రి జాతర
మాకు
నారు వేస్తుంటే జాతర
పైరు కోస్తుంటే జాతర
ఏరువాకలు ఎదురుపడితే
ఆరుగాలం అలుపెరుగని జాతర
ఆశతో మెడలు వంచాలన్నది
బ్రోకర్ల కూహకం
దురాశతో తొడలు విరచాలన్నది
మేకర్ల నిర్వాకం
భూమి లేకుంటే రైతు లేడు
రైతు లేకుంటే భూమి లేదు
భూమికి పర్యాయపదం రైతు
రైతుకు మర్యాదపదం భూమి
మంచెను కూల్చాలా?
కంచెను కాల్చాలా?
మేకలు కసాయికా?
ఆవులు ఆల్కబీర్ కా?
పొలంలో నేను నడుస్తుంటే ఆనంద నాట్యాలు చేస్తూ
ఎగిరే ధూళి కణాలను కాలువల
ద్వారా నాతో పాటే నడిచే
నీటి బిందువులను
ఎలా మరువగలను?
కరెన్సీ కట్టలు బ్యాంకు వడ్డీలు
రైతును పిలవలేవు కొలవలేవు
రైతు రైతే
నాగలి మోసేవాడు రైతు
ఆకలి తీర్చేవాడు రైతు
వానలు లేవనో వాగులు రావనో
అమ్మను
కరాళ కరువుల పాదాక్రాంతాలు
కర్కశ కౌరవుల అన్యాక్రాంతాలు
నన్ను అమ్మించలేవు
నమ్మించలేవు
బతుకీడుస్తున్నది
సంసార బండి
లాగిస్తున్నది ఈ భూమే
జీవనాధారం ఈ భూమే
వెలుగు రేఖలు ప్రసరిస్తున్నది
ఈ భూమే
భూమి లేకుంటే నేనెగరేసేది
సూత్ర రహిత గాలిపటమే
భూమి లేకుంటే నేనెమరేసేది
పాత్ర విహిత చిత్రపటమే
మా తాత సమాధి
దగ్గర మా అయ్య
మా అయ్య సమాధి
దగ్గర రేపు నేనూ
నా పిల్లలు రైళ్ల మీద బస్సుల
మీద ఊరువచ్చి ఆరడుగుల
నేల అప్పుగా అడగాలా?
అమ్మను
-కోటం చంద్రశేఖర్
94920 43348