ఎంత ఐశ్వర్యవంతురాలీ వృక్షరాజం!
ఆకుల కరెన్సీ నోట్లు
మొగ్గల వజ్రాలు.. పుష్పాల మణులు
పుప్పొడి పుత్తడి.. పిందెల వైడూర్యాలు
కాయల మరకతాలు
పండ్ల మాణిక్యాలు
కొమ్మల రెమ్మల లాభాల సొమ్ములు
గిజిగాళ్లల్లిన కళాకృత భవంతులు
ఎంత పెద్ద కుటుంబం ఈ తరువుది!
ఆకులే బంధుమిత్రులు
మొగ్గలే చిట్టి పాపలు
పిందెలే చంటి బాబులు
పుష్పాలే ఎదిగిన సంతానం
కాయలే ప్రతిభా పాటవాలు
పండ్లే కీర్తి ప్రతిష్ఠలు
పుప్పొడే అనురాగానుబంధం
పక్షులే అతిథి అభ్యాగతులు
శాఖోపశాఖల వంశావళి
ఎంతటి వీర, ధీర ఈ భూరుహ!
పత్రాలే సైన్యం
మొగ్గలే వ్యూహరచనలు
పిందెలే తర్క వాదనలు
కాయలే బల నిరూపణలు
పువ్వులే శస్ర్తాస్ర్తాలు
పండ్లే కమ్మటి గెలుపులు
కొమ్మా రెమ్మలే యుద్ధతంత్రాలు
పుప్పొడి పరాగమే ఆత్మబలం
ఎంతెంత ప్రేమమయీ ఈ మ్రాను!
పత్రాల లేలేత కారుణ్యం
మొగ్గల గర్భీకృత దయాపారం
పిందెల చిలిపితనం
కాయల గడుసుతనం
పూల వర్ణాల నేత్ర విచలితానందం
పండ్ల తీపి మమకారాలు
కొమ్మా కొమ్మల
టూగుటుయ్యాల జంపాలలు
పుప్పొడి సువాసనల ఘుమఘుమలు
పిట్టల పాటల రాగవల్లరులు
ఎంతటి చరితార్థురాలీ మహా
మహీరుహము!
విస్తరించిన అల్లిబిల్లి వేళ్ళ కింద
పరచుకొన్నదదే
మట్టి ఒడి… అమ్మ లాంటి మెత్తనిది
మహిమాన్వితమైనది!
-దాసరాజు రామారావు