మట్టి భాష తెలిస్తే
చెట్టు ఘోష అర్థమయితది
గాలి విలువ గమనిస్తే
హరిత స్వప్నం విచ్చుకుంటది!
నీటి విలువ నీకేం తెలుసు
పంట పొలాలకు ఎరుక
ఎగిసిపడుతూ సముద్రం వైపు
వెల్లువెత్తే నదీనదాలను చూస్తుంటే
క్రూరమైన ఎగతాళొకటి
ఎదను నిలువునా చీలుస్తది!
నీటికి విలువ కట్టే రాజకీయాలు
కాటికి కాళ్లు జాపినట్లే
అవి ఇప్పుడు వట్టి నీళ్లే కావచ్చు
మట్టితో చేతులు కలిపితే
రత్నాలను పండిస్తాయి
రాజ్యాన్ని ధాన్యాగారం చేస్తాయి!
సంపద సృష్టికర్తలు
రెండే రెండు
భూమి-నీళ్లు
ఎవరు ఎంత గొప్పలకు పోయినా
మనం వట్టి సంధానకర్తలం మాత్రమే!
కరువు కోరల పదును తెలిసినవాడు
కాలాన్ని కలగన్నాడు
ఎన్నటికీ ఎడారే అనుకున్న తెలంగాణ
దేశానికి ఇప్పుడు ఆహారాన్ని
వాగ్దానం చేస్తున్నది!
బహుళ అంతస్తుల మేడలు
తలెత్తుక నిలబడాలన్నా
నగర జీవనం కలకాలం
తళతళ మెరవాలన్నా
నిర్మిత జల నిధుల పైన
నిందలు వేయరాదు.. వేయరాదు!!
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
9440233261