పిట్టల్లా వాలిపోతున్నారనటానికి
వాళ్ళేమన్నా చెట్లకి పుట్టారా?
పువ్వుల్లా రాలిపోతున్నారనటానికి
తోటల్లో ఎదిగారా?
సమాజ పర్వతంలో మొలిచిన
సంజీవనులు వాళ్ళు…
రక్తాన్నే ఇంధనంగా చేసి ఎందరి
జీవితాలనో మేలుకొల్పిన
మండే సూర్యులు వాళ్ళు..
క్షరం లేని అక్షరాలని మింగిన
అపర ఆంజనేయులు వాళ్ళు..
హఠాత్తుగా వచ్చిన గుండె
పోట్లు అంటారేమిటి?
వారి గుండెల్ని అడ్డు పెట్టే కదా
నిరంతరం పేదోళ్లను కాపాడింది
అనారోగ్యంతో అశువులు
బాసారని రాస్తారేమిటి?
అస్తవ్యస్తత సమాజానికి
జవసత్వాలు ఊదీ ఊదీ
ఆరిపోయిన ఊపిరి జ్యోతులు కదా!
వారి అంతిమ వార్తలు
సోషల్ మీడియాలో మరణ మృదంగాలు మోగిస్తున్నాయి
పత్రికలు ఒళ్ళంతా చావు కబుర్ల పచ్చబొట్లు పొడిపించుకుంటున్నాయి
వాళ్లంటే వ్యక్తులా?
నిటారుగా ఎదిగిన సిద్ధాంతాలు!
అష్టావక్ర లోకానికి సమానత్వ సూత్రాన్ని అందించిన దార్శనికులు..!
మూడు పొద్దుల్లో తిన్నారో తినలేదో ఎవరూ అడగకపోయినా
అడిగినవాళ్ళకీ -అడగనివాళ్ళకి సమానంగా
అక్షర సేద్యం చేసి జ్ఞాన ధాన్యాన్ని
అందించిన నిస్వార్థ రైతులు వాళ్ళు!
చిక్కులనెన్నో అధిగమించిన
హక్కుల సంరక్షకులు వాళ్ళు!
ఇదేమి చోద్యం?
పోస్ట్ మార్టంలు ఆసుపత్రుల్లో
కదా చెయ్యాలి!
వాట్సాప్‌లలో చేస్తున్నారేమిటి?
ఎప్పుడూ వాళ్ళ బతుకుల్లోకి
తొంగి చూడనివాళ్ళు
వ్యాఖ్యాతలుగా
సభల్లో వాళ్ళని సాకినట్టు
చెప్పేస్తున్నారేమిటి?
తూట్లు తూట్లుగా వాళ్ళని
తూటాలతో ఛిద్రం చేసినవాళ్ళు
దొంగ ఏడ్పులతో పార్థివదేహాన్ని
భుజాల మీదకి ఎత్తుకుంటున్నారేమిటి?
వాళ్ళకి అంతం అంటూ
ఆ కలం రక్త దేహాన్ని నిర్దయగా
భూమి పొరల్లో పాతేస్తున్న
వాళ్ళకి తెలిసినట్టు లేదు
ఇది చరమ గీతం కాదు..
రేపటి సూర్యోదయం వరకూ వేచి
ఉండమని వాళ్ళకి చెప్పండి!
చితాభస్మం కోసం కాదు,
రక్త పునీత మృత్తికలలోంచి
ఎగిసే ఆశయాల మొక్క
రెండాకులనే ఆయుధాలుగా మలచుకొని
మళ్ళీ ఉదయిస్తుందని హెచ్చరించండి…!
వారి బతుకే కాదు
వారి చావు కూడా ఓ ధిక్కార
సందేశాన్ని వినిపిస్తుంది
మనుషులుగా మన కోసం బతికిన
వారి అంతిమ యాత్రలో
నికార్సైన ఆత్మలతో అనుసరిద్దాం రండి!
మరికొంత మందికి
అలా బతుకాలన్న స్ఫూర్తిని
కలిగిద్దాం పదండి!!
ఇది మరణం కాదు..
అంతిమయాత్ర అసలే కాదు..
-అయినంపూడి శ్రీలక్ష్మి
9989928562