చంపబడ్డవాళ్లది సగం ప్రదర్శన
గెలుపు కాలికి గాయం
సైనికుడెవరో చరిత్రకు ఎక్కడు
రాజ్యం పేరు మీదనే అతని శవం
చెలామణి అవుతుంది
రాజు మారినప్పుడల్లా
జనాకాంక్షలు
అవనతమవుతుంటాయి
రాజ్యం విస్తరించినప్పుడల్లా
పాతనీరు కొత్తనీటిని
మలిన పరుస్తుంటుంది
పక్షులు కొన్ని
కళేబరాలను శుభ్రం చేస్తాయి
అజీర్ణ వ్యర్థాలు
భూమిలోకి దిగి రహస్యాలను మోస్తుంటాయి
యుద్ధం జరిగిన చోట
అట్టకట్టిన
రక్తపు మడుగులను
వర్షం కడిగివేస్తుంది
భూమి ఎరుపుని
చెట్లు మొలిచి పచ్చబరుస్తాయి
అయినా
యుద్ధం ఎప్పుడూ అసంపూర్ణం
నిప్పు ఆరిపోదు
కోటల చీలికల మీదుగా
నాలుకలు చాపుతుంటుంది
ప్రజలు
యుద్ధం వద్దని
వర్షం కోసం ఎదురుచూస్తుంటారు
చెట్లకు మొక్కుతుంటారు
అయినా
యుద్ధం ఎప్పుడూ అసంపూర్ణం
అది గొడ్డలిగానో
అగ్గిపుల్లగానో ఎదురొస్తూనే ఉంటుంది
అనివార్య ఆధిపత్యం
నిరూపించుకొని వెళ్తూనే ఉంటుంది
– దేవనపల్లి వీణావాణి