పరుగుల నది ఒకటి చూద్దామని
కన్నుల కాయల్ని
వెంటేసుకుని నడక ప్రారంభం
దారి పక్క నుండి
పూల వాసన హాయినిచ్చింది
మనుషులను పశుగణాలను
దాటుతూ నడక
చూపులకందని భావాలు ఒదిగి
ఆఘ్రాణింపులు మనసువీ అవుతాయి
ఇంతలో…
ముక్కుపుటాలదిరే
బురద కంపు వేదన అవుతుంది
గమ్యం తప్పని గమనం
నా దృష్టి అంతా కొత్త సమత్వ
ఫలాల అన్వేషణ కోసమే
రాళ్లపై కాళ్లు పడ్డాయేమో
బెణుకులు..
తూలి పడబోయి
నిభాయించుకుంటూ నడక..
పాదముద్రల ముద్రితాలను స్మరిస్తుంటే
కొన్ని సన్నివేశాలు
గుండె చెరువు బాతుల
గుంపుల విహారమవుతాయి
ఎన్ని కాళ్ళు నడిచినవో ఈ దారిపైన!
పసిరిక వన్నె వరి
పొలాలు తలలూపే నేలలు
చౌడు భూములు… మైదానాలు…
పచ్చని తలలాడించే గట్టులు గుట్టలూ
ఒకటా రెండా?
సాగర పర్యంతం పయనించినవి
పొలమారిన జ్ఞాపకాలు
ఆకాశం ఎత్తు ఎత్తుగా
పూలు రాలిన నేల
విలువల ప్రతినిధి అయ్యి
ఈ మట్టి పరిమళాలను జతకట్టింది
నిమగ్నత ప్రకాశమానమై
నాకు ఫలదృశ్యంగా కనిపించింది
నా చూపులనల్లుకున్న తీవకు
రంగురంగుల పువ్వులు
మువ్వన్నెలవుతున్నవి
నేను దర్శించింది
నది నవ్వుల నీటి జాలును
జలజలా గలగలా
నాదాలై వాదాలై నడుస్తూనే ఉన్నది
నా దేశం
నిరంతర స్వేచ్ఛా ప్రవాహ సందోహమే!
నా దేశం
కీర్తి వర్ణాల శోభితం
నేను పైకెత్తిన
త్రివర్ణ తత్వ స్వచ్ఛతనే
నింగి నేల నా దేశం
కలల అలల జీవనది
స్వేచ్ఛా సమానత్వ చేతనం
నా భారత దేశ అస్తిత్వకేతనం!!
-కొండపల్లి నీహారిణి