పుస్తకం ఓ జవ్వని
దేహం నిండా పచ్చబొట్లే
అర్థవంతమైన అక్షరాలే అవి..
కావ్య రచన ఓ లేపనం
అనుభవాల గాయాలకు వేసిన కట్టు
అనుభూతుల క్లేశాలకు పూసిన మలాం
పుస్తక పఠనం ఓ పురా పరిచయం
విస్మృత జన్మల పునర్దర్శనం
అనూహ్య విశ్వాల సందర్శనం..
గ్రంథ శ్రవణం
భరోసానిచ్చే మంత్రాక్షరం
అనన్య పాలపుంతల సాక్షాత్కారం
అందుకే పుస్తకం నాకు
నిన్న, ఓ అనగనగా కథ..
నేడు, నా కండ్ల ముందరి జీవనచిత్రం
రేపు, నాతో సంభాషించనున్న సమూహం..
పుస్తక ప్రపంచంలోకి ఎగురెళ్లితే
ఒళ్లు పులకరించే ఆర్ద్రతా పవనాలు
గుండె చెమ్మగిల్లే ఆప్త మేఘాలు
సుదీర్ఘ నిట్టూర్పుల జ్వాలలు
అవిరామ సందిగ్ధతల నదీ ప్రవాహాలు
క్లుప్త సుందర సంక్షోభ వనాలు
నిత్యం విప్లవాగ్ని కీలలు
నిరతం బిగిసే పిడికిలి ధిక్కారాలు ..
పలకరిస్తాయి.. మనల్ని నడిపిస్తాయి
ఇప్పుడు చెప్పు…
పుస్తకమంటే పుటల పొత్తిలి మాత్రమేనా?
వాక్యాల గుమ్మి మాత్రమేనా
కానే కాదు కదా!
రచయితకు జీవన సాఫల్య పురస్కారం
పాఠకుడికి నిత్య గీతాసారం
ప్రపంచానికి 15వ లోకం…
– ఐనంపూడి శ్రీలక్ష్మి 99899 28562