పుట్టుకకు, బతుకుకు ఆధారభూతమైన ప్రకృతిని పూజించడం, గౌరవించడం మన సంస్కృతి. దానికి చిహ్నం బతుకమ్మ. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు. మన ఆచార వ్యవహారాలను, మన సంబంధ బాంధవ్యాలను, మన జాతి సంస్కృతిని గుర్తు చేసుకునే ఒక గొప్ప అవకాశం. తరతరాల సాంస్కృతిక సంపదను గుర్తు చేసుకొని జాతి సమైక్యంగా చేసుకొనే పండుగ. బతుకమ్మ అంటే పూలపండుగ.
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పూల పండుగను భిన్నరీతుల్లో జరుపుకోవడం ఆనవాయి తీ. ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా జరుపుకొంటున్న పండుగ బతుకమ్మ. ప్రకృతి గురించి మనిషిని ఆలోచింపజేసే నిండు పండుగ ఇది. మహిళలంతా సామూహికంగా జరుపుకొనే ఈ పండుగ వెనక చారిత్రక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీలక్ష్మి దేవియు చందమామ
సృష్టి బతుకమ్మయ్యె చందమామ
పుట్టినా రీతి జెప్పె చందమామ
అంటూ సాగే పాటలో బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలుంటాయి. ఈ పండుగను జరుపుకోవడం అంటే లక్ష్మీ పార్వతి దేవతలను పూజించడంగా భావిస్తారు తెలంగాణ ప్రజలు. అస్తిత్వ సంస్కృతిలో పుట్టి కొనసాగుతున్న పండుగ ఇది. అస్తిత్వ సం స్కృతిలో తాత్వికత, అర్ధంకాని మార్మికత ఏమీ ఉండదు. ఇందులో సహజ సౌందర్యంతో పాటు జీవన సౌందర్యం,శబ్ద సౌందర్యం, మానవీయ పరిమళాలు గుబాళిస్తుంటాయి.
కాకతీయుల కాలంలో పుట్టిన పండుగ ఇది. ఆ తర్వాత జానపదులు నేటివరకు ఈ పండుగ సంప్రదాయాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. చిరుమార్పులతో ఆనాటి మూల పండుగనే నేటికి జరుపుతున్నారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులుండేవి. చెరువుల వల్ల ఆనాటి ప్రజల బతుకులు బాగయ్యాయి. కాబట్టి ఏడాదికోసారి చెరువులకు పూలతో నెనరులు (కృతజ్ఞతలు) చెప్పేవారు. అందుకే ఇది ‘చెరువుల పండుగ’.
పెత్తరమాసనాడు పేర్చే బతుకమ్మను ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అంటారు. అంటే ఎంగిలి పడ్డాక పేర్చేది అని. మిగిలిన రోజుల్లో మాత్రం బతుకమ్మ ను పేర్చి పూజ చేసిన తరువాతనే భోజనం చేస్తారు. మొదటి ఎనిమిదిరోజులూ సిబ్బినిండా పూలను పేర్చి చిన్న బతుకమ్మలను చేస్తారు.
తొమ్మిదోరోజు బతుకమ్మను సద్దుల బతు కమ్మ అంటారు. వాటిని పూల ముగ్గుల్లో పెట్టి, చుట్టూ తిరుగుతూ లయాత్మకంగా చప్పట్లు కొడుతూ..
ఒక్కేసి పువ్వేసి సందమామ
ఒక్క జాములాయె సందమామ
రెండేసి పువ్వేసి సందమామ
రెండు జాములాయె సందమామ
అంటూ పాటలు పాడి, ఆటలు ఆడి రకరకాల వాయినాలు ఇచ్చుకుంటారు. ‘వివిధ రకాల పూల తో కూడిన బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేసినపుడు, ఆ పుష్పాలకుండే ఔషధగుణం నీటిలో కలిసి ఆ నీరు సూక్ష్మజీవరహితమై వాడుకోవడానికి యోగ్యంగా కూడా తయారవుతుంది’
కొడవండ్లు గొడ్డండ్లు ఉయ్యాలో
మన సేతులయినయే ఉయ్యాలో
అన్నట్లుగా బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రతి ఉద్యమ సందర్భంలోనూ పాటల కొడవలిగా మెరిసింది. సాంస్కృతిక ఆయుధంగా వెల్లివిరిసింది. జీవితమంతా పండుగలాగా జరుపుకోవాలనే సామా న్య ప్రజల సందేశమే బతుకమ్మ. అన్నింటినీ మించి బతుకమ్మ స్త్రీల సంగీత, సాహిత్య, నృత్య కళానైపుణ్యాలకు ప్రతీ క. ప్రపంచంలోనే మరెక్కడాలేని పూల జాతర ఇది.
డాక్టర్ ,వంగరి త్రివేణి
9951444803