రాతి బొమ్మకు రాగం కట్టినవాడా
రాక్షస నీతిని స్వర ఖడ్గంతో ఛేదించినవాడా
భావోద్వేగ బంధాన్ని తట్టిలేపినవాడా
దశబంధ చెరువులను
ఒక్క గొంతులో ఒంపుకున్నవాడా
నిద్రాణ నిశీధిలో నిప్పుకణమై
మెరిసిన వాడా ఇలా ఎన్నని ఎన్నెన్ని
సందర్భాలను గుర్తు చేసుకునేది సాయీ..
తెలంగాణ సమరాంగణమున
ఎన్ని దుఃఖాలను
ఆలపించావని లెక్కించగలం..
ఎన్ని సభల్లో నీ సమ్మోహన గానం
పిడికిల్లెత్తించిందని చూడగలం
ఇంటి నుంచి అరుణారుణ గానాలను వింటూ
గులాబీ వనంలో
పరిమళించిన గొంతుకగా
పరవళ్ళు తొక్కించిన నీ గానం
వినని చెవ్వు లేదు ఈ గడ్డ మీద
నీ పాటకు పిడికిలెత్తని చేయి లేదు తెలంగాణల
వెలుగుతున్న తెలంగాణలో
ఎగిరే నీ స్వరజెండా
ఇప్పుడప్పుడే ఆగిపోతుందని
కలలోనైనా అనుకోలేదు
రాతి గుండెలను
కరిగించిన నీగానం
తరలెల్లి పోతదని తలచలేదు సాయీ..
ధిక్కార నేలపై దివిటీగానమై
ప్రజ్వరిల్లిన నీ స్వరం
తెలంగాణ నేల మీద
ప్రవాహ సదృశ్యమై
పారాడుతూనే ఉంటుంది.
(సాయి చంద్ అకాల మృతికి నివాళిగా)
నూర శ్రీనివాస్
91827 77011