మనిషి పరిధి
బతుకుతున్నాం బావిలో రూపాయి కప్పలా
మందలో గొర్రెలా, మేకపోతు గాంభీర్యంతో
వీలైతే ప్రతిదానిపై పెత్తనం చేస్తూ
తిన్న ఇంటి ప్రకృతి వాసాలు లెక్క పెడుతూ
మన బతుకు మనమే దర్జాగా భావిస్తూ
కీర్తి కిరీటం కోసం అడ్డదారులు
ప్రతిభ వెంట పడటం లేదు
పదవి కుర్చీ కింద అడ్డమైన గొడ్డు చాకిరీ
తప్పని తెలిసినా తెలియనట్లు నటన
వేలెత్తి చూపాల్సిన చోట మూతికి మాస్క్, మౌనం
పిడికిలెత్తి గర్జించాల్సిన సమయంలో
గులామీ సలాములు
ఆకాశమంత విజ్ఞానం ఎదిగినా
ఎవరి గజ్జి వారికి ఆనందం
ప్రమాదంలో ఊపిరందించి పైకి లేపడం లేదు
సెల్ఫోన్లో రీల్స్ చేయడంపై తపన
సంకలో అహం చెయిసంచితో బతుకుతున్నాం
ఎన్నోసార్లు భయం గుప్పిట బతుకీడుస్తున్నాం
కామం కావురంతో అన్ని హద్దుల హాంఫట్
స్వార్థం కడుపు నింపుకోవడం కోసం
బలి తీసుకుంటున్నాం ఎందరినో
పశువుల్ని హీనంగా చూస్తాం కానీ
పశువుల కన్నా హీనంగా ప్రవర్తన
పరిధులు దాటించిన ప్రతిభ అనంత ఆకాశానికి
ఎదిగిన కొద్దీ ఒదుగుతున్నాం యాంత్రికతకు
మానవత్వం నుదుటిపై చెరిపేసుకుంటున్నాం
మమతల ఆలింగనాలౌతున్నాయి
గాలిలో ముద్దులు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉట్టి మీదికెక్కించి
ఒంటరి జంట ఒంటి స్తంభం మెడలో
కులుకుతున్నాం
మనిషితనం పరిధిలు కుంచించుకుపోతున్నా
గుడ్లు మిటకరిస్తున్నాం కళ్లు తెరవడం లేదు
కొమురవెల్లి ,అంజయ్య
98480 05676