రాలిన పూలన్నీ
ఒకప్పుడు వైభవంగా ఊరేగినవే
అనుభవాలే ఎవరికైనా
వేదాంతం నేర్పే గురువులు!
ప్రతి గాయమూ
ప్రయాణంలో భాగమే
చరిత్ర ఆనవాళ్ల కోసం
గాయాలనే ఎంచుకుంటుంది!
మట్టి అంటని పాదాలెప్పుడు
భూమిలో కూరుకుపోయిన రథచక్రాలే
అవెప్పటికీ సుఖం శిలువ మీద
చెదరని మరకల గుర్తులే!
గాయాలను లెక్కిస్తూపోతే
ప్రయాణాలు ఆగిపోతాయి
ఎదిగిన లోకాన్ని కొలవటానికి
ఎవరికైనా గాయాలే ప్రమాణం!
ఒక స్వప్నం ఫలించాలంటే
దుక్కి మాత్రమే దున్నితే సరిపోదు
దుఃఖాలన్నీ మోయాలి
నడిచే పాదాలకు ఉక్కును తాపాలి!
ఆవలి తీరం చేరాక
అలసిన పాదాలను మీటితే
జీవనకాలపు బడలిక
మాయమైపోవాలి
కళ్ళు వెలుతురు గోళాలై
మెరిసిపోవాలి!!
చివరగా మిగిలేదేమంటే
నలిగిన పాదాలే రేపు
జనం నాల్కల మీద
పద్య పాదాలై పరిమళిస్తాయి!!
కోట్ల
వెంకటేశ్వర రెడ్డి
94402 33261