Meerut : పోలీసులు అంటే ఏదైనా ఎమర్జెన్సీలో కాల్ చేస్తే వెంటనే ఘటనా స్థలానికి రావాలి. కానీ, యూపీలో పోలీసులు మాత్రం తీరిగ్గా, రెండు గంటల తర్వాత వచ్చారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. ఉత్తర ప్రదేశ్, మీరట్‌లోని లాల్కుర్తి మార్కెట్‌కు ఇద్దరు అక్కాచెల్లెళ్లు షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు యువకులు వారిపై అసభ్యకర కామెంట్స్ చేశారు.
దీంతో ఇద్దరు అమ్మాయిలు ఆ యువకులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత యువకులు కూడా మళ్లీ యువతులపై బూతు మాటలతో రెచ్చిపోయారు. దీంతో ఆ యువతులు.. యువకుల మధ్య గొడవ పెద్దదైంది. ఇది చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్లు, వ్యాపారులు కూడా మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఆ యువకుల్ని తప్పుబట్టారు. ఈ గొడవ మరింత పెద్దది కావడంతో ఆ అక్కాచెల్లెళ్లు ఎమర్జెన్సీ నెంబర్ 112కు కాల్ చేశారు. ఈ కాల్ అందుకున్న రెండు గంటల వరకు పోలీసులు ఘటనా స్థలానికి రాలేదు.
ఈ లోపు స్థానిక వ్యాపారులు ఆ యువకుల్ని తప్పుబట్టారు. వారితో వాగ్వాదానికి దిగారు. అప్పుడు ఆ యువకులు భయపడి అక్కడినుంచి పారిపోయారు. ఈలోపు ఘటన గురించి తెలుసుకున్న యువతుల బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొందరు హిందూ సంఘాల నేతలు కూడా అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కానీ, పోలీసులు మాత్రం అప్పటికా రాలేదు. రెండు గంటల తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు పోకిరీల్ని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పోలీసులు అంత ఆలస్యంగా రావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేసేది అత్యవసరంగా, వేగంగా భద్రత కల్పిస్తారని.. అలాంటిది ఆలస్యంగా వస్తే ఇంక ఎమర్జెన్సీ సర్వీస్ దేనికి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా స్పందిస్తే ఎలా అని విమర్శిస్తున్నారు.