చెరువుగట్టు మీద నిలబడి చూడు!
విషాద దృశ్య మొకటి
కండ్లకు కరుకుగా, క్రమక్రమంగా
రూపు గడుతున్నది
కేరింతల అలలు
చిటికెన వేలు పట్టు తప్పి,
అగాధంలోకి జారిపోతున్నయి
గుమిగూడిన నీటి సుడుల్లో
వికలఘోష విహ్వలిస్తున్నది
నునుపు మీనాల చూపులు నిల్చిపోయి,
అయోమయావస్థలో కాంతిహీనమైనయి
చెంగోబిల్లల బుడబుంగలు మునిగి
తేలటం మరచిపోయినయి
సహజ శోభల ఎండా వానా
చేష్టలుడిగి, చెరువును
దీనంగా చూస్తున్నయి
తడలు తడలుగా వీస్తూ,
జల తడులతో
ప్రాణగాలి, దుఖాన్ని పంచుకుంటున్నది
పుత్తడి వెల్గుల మత్తడి దుంకిన
చెరువు మౌనముద్ర దాల్చింది
సింగిడి రంగుల బతుకమ్మలతో
నిండిన చెరువు
బతుకు కళ తప్పింది
సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, మబ్బులు
చెరువులో ముఖారవిందాన్ని దిద్దుకోలేవు
వరిగొలలు పాలు పోసుకోలేవు
కట్టమైసమ్మ జాతర ఆగమైనట్టే
చెట్టూ చేమా ప్రకృతి
ఆకులు రాలే కాలాల్నే మోస్తాయి గావొచ్చు
తూంగేటు మీద పాలపిట్ట వాలాలె
మళ్ళా చెరువు శతాధిక నవ్వు నవ్వాలె
దాసరాజు రామరాజు