మట్టిలో కలలు విత్తుకున్నా
మనసంతా నింగి మీదే
చుట్టం చూపుగా అయినా వచ్చిపోనీ
వాన కోసం ఎదురుచూసీ చూసి
కన్నీళ్లు కురుస్తాయి గానీ
మేఘం ఏ మాత్రం జాలి తలచదు
తడిలేని పంట ఎడారి
కరువు కాలానికి తోడు
పేగుల్ని తింటూ ఆకలి పుండు
రెండు ఎడ్లను నమ్ముకొని
నాలుగు కాళ్ల మెడకు నాగలిగట్టి
బతుకు తెరచాప ముందుకు నడిపిస్తూ
తలరాత మారిపోయే గీతలు ఏవో
మట్టి పలక మీద పచ్చటి చిత్రాలు గీస్తూ
రేపటి అన్నపు రాశుల కోసం
స్వేదజలం చల్లుతారు
బారసాల జరుగుతున్నట్టు పైరు పాపల
ఊయల పండుగ జరుపుతున్నట్టు
మొలక నవ్వులు నాటుతారు
కాలువ తల్లిని బతిమాలి
ఇన్ని నీళ్ళు సాయం కోరుతారు
కష్టం చూడలేక
అప్పు ఇచ్చిన షావుకారు లాగా
కరుణ గలిగిన ఋతువు
కొంత చినుకుపాట ఒలకబోసుకుంటుంది
పుష్కర స్నానం ఏదో పూర్తయినట్టు
కర్షక హృదయం సంబురమవుతుంది
కింద మీద పడి
కుందేలు మీద తాబేలు గెలిచినట్టు
పంట కోత కొస్తుంది
అలుకుజల్లుకొని కల్లాలు ముస్తాబవుతాయి
అప్పు వసూళ్లకు వచ్చిన సేటు లెక్క అవసరానికి
ఎంత పిలిచినా పలుకని వరుణ దేవుడు
విశ్వరూపం ప్రదర్శిస్తాడు
బాగుపడితే చూడలేని కుళ్లుబోతు కాలం
బోరు బోరున విలపిస్తుంది
చేతి కొచ్చిన పంట
నోటికి అందకుండా తన్నుకు పోతుంది
పంటంతా తొక్కి తొక్కి పాడుజేసిన
వాన రాక్షసి ముందు
గుండె దుఃఖ సాగరమవుతుంది
గాయం మానని గానమవుతుంది
పట్టువదలని విక్రమార్కులు
మళ్లీ మట్టిని ముద్దాడుతారు
ఆకాశానికి దండం పెడుతారు
బతుకు పాఠం చదువుతూ
కాల పరీక్షకు ఎదురు నిలబడుతారు.
గజ్జెల రామకృష్ణ
89774 12795