నా ఇంట అమ్మ చెప్పిందే
నా భాష
అత్త అమ్మ నాన్నతో మొదలై
ఇంతింతై వటుడింతై
భాషను మెరుగులు దిద్దుకుంటూ
అక్షరం దిద్ది
వాక్య నిర్మాణంతో
నలుగురిలో వ్యవహార శైలిలో
భావ ప్రకటనలో
అమ్మ చెప్పిందే పైచేయి
ఎవడో నాపై
బలవంతంగా
సంస్కృత పాళీ ప్రాకృతిక జనపదాల
సంకర సంపర్క భాష హిందీని రుద్దాలంటే
నేనెందుకు ఒప్పుకుంటా?!!
మూలవాసిని నేను
నా మూలం ద్రవిడం
పరాయి ఆక్రమణనే సహించని నేను
పరాయి భాషనెలా ఆహ్వానిస్తా?!
నాలుగు రాష్ర్టాల భాషను
దేశాన్ని స్వారీ చేయిస్తానంటే
పిడికిళ్లు బిగుస్తాయి
గళాలు పిక్కటిల్లుతాయి
రాజ్యాంగం నా దిక్సూచి
జాతీయ భాష నిబంధన లేనే లేదు
ఎవడి భాష వాడిదే
లిపి లేని భాషలెన్నో
మరుగున పడుతున్నాయి
ఎవడికి కావాలి హిందీ
పోనీ ప్రపంచీకరణ పోటీలో
అనివార్యమూ కాదు!!
నా అమ్మ చెప్పిందే నా భాష
కాదంటే ఘోరీ కడతా!!
గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201