నేనేం రాసినా నువ్వేం చేసినా
సమకాలీనులెవ్వరు మెచ్చరు
ఇది చరిత్ర నేర్పిన పాఠం!
కార్యశూరులెవ్వరు
తక్షణ స్పందనలు ఆశించరు!
నిర్మాణం మొదలుపెట్టి
పూర్తిచేసేవరకు హ్రస్వదృష్టి నిత్యం
ఆందోళనలు రచిస్తూనే ఉంటది!
గెలుపు మూలాలెరుగని వారు
ఆచరించే ఛీప్ ట్రిక్స్ అవి!
అనుచర మరుగుజ్జులు
ఔనేమోనని భ్రమిస్తుంటారు
వారి ఊహలు తలకిందులైనప్పుడల్లా
వలపోతల స్వరాలు మారుతుంటాయి!
మన లెక్కచేయనితనమే వారికి
మరింత దుఃఖాన్ని మిగులుస్తుంది!
కలగనడం చేతగానివారికి
నిర్మాణాలు ఊహకందవు
వంతెన కింది ప్రవాహాలు
సవాళ్లను స్వీకరించలేవు!
యుద్ధంలో గెలువడం ఎంత ముఖ్యమో
యుద్ధానంతర దృశ్యాలను
సరిచేయడం పెను సవాలే!
అస్తిత్వం నిలబెట్టిన గెలుపు
ఆవలి తీరం చేర్చకపోతే అర్థముండదు
అభివృద్ధి ఎప్పుడూ సంపూర్ణ వాక్యం కాదు
విరామం ఎప్పుడూ ఒక ఆటవిడుపే!
వెకిలితనంతో చేసే విమర్శలు
మన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు!
నిందలు నిష్క్రియా పరులెన్ని మోపినా
నువ్వూ నేనూ అదే పనిలో ఉందాం
నాది నిత్య రచన నీది సత్వర నిర్మాణ తపన!
ఇటుక పేర్చింది మొదలు
ప్రతి వాడు వేలెత్తి చూపేవాడే!
ఉబుసుపోక రాజకీయాలకు కాలం చెల్లాలంటే
నువ్వూనేనూ ఎవరి పనుల్లో వాళ్లం
ఎప్పటిలా నిత్యం లీనమైపోవాలి
చరిత్రలో నిర్మాణాలు నిలిచిపోవాలి!
కాలమెప్పుడు గొంతెత్తి పలికే ఒకే ఒక్క మాట
ఇకపై అందరి నోట ‘సత్యమేవ జయతే!’
కోట్ల
వెంకటేశ్వర రెడ్డి
9440233261