నీళ్ల కోసం కలలు గన్న ఈ కండ్లు
ఎన్ని దశాబ్దాలు వేచి చూసినవో
నేలను నమ్ముకున్న కండ్లల్లో
నీటి సుడులకు తెలుసు
నీటిజాడకోసం తిరిగిన
మట్టి పాదాలకు తెలుసు
నాగలి కర్రుకు తగిలిన
రాళ్ల రాపిడికి మోగిన
మోతలకు తెలుసు
వాలిన వరికంకుల
వేదనకు తెలుసు
తేలిపోతున్న మబ్బుతునకల
మూగరోదనకు తెలుసు
మంచెమీద జీరగొంతు
పాటకు తెలుసు
ఇప్పుడే తెలిసింది
నెర్రలు విచ్చిన నేల
కండ్లు చెమర్చిన
రోజొకటి వస్తుందని
నేలతల్లి పరవశించి
ఆనంద తాండవమాడె
రోజొకటి వస్తుందని
నీలిమబ్బులు పరవశించే
మంచిరోజు లొస్తాయని
కాల్వలు తనివితీరా
తలంటు స్నానం
చేసే రోజొస్తుందని
ముత్యాల రాశుల్లా
నీటి బిందువులు
కదులుతూ నేలతల్లి
మెడకు నీటి మాలలు
కట్టే రోజొస్తుందని
పిల్లల పాదాలు
తాకి చెరువు మది
పాటలు పాడే రోజొస్తుందని
నేలతల్లి ఆకుపచ్చ చీరలో
తళుక్కుమనే రోజొస్తుందని
నింగినుంచి
దిగివచ్చిన సింగిడి
ఇండ్ల వాకిండ్ల
ముందు ముగ్గులు వేసే
రోజొకటి వస్తుందని
ఇప్పుడే తెలిసింది.
డాక్టర్ సుంకర రమేశ్
9492180764