ఊరు మళ్ళా ముచ్చటయ్యింది
సాయంత్రం పశు ధూళితో
సాంబ్రాణి వేసిన దేవాలయమయ్యింది
పొక్కిలైన వాకిల్లు అత్తరు బుడ్డీలై
జానపద సంగీతంలో గజ్జెల మోతయ్యింది
అధికారాన్ని కాక నీళ్లను నమ్ముకున్న వారి పాలనలో
ఎండిన నేలల్లో తడిజాడల పలకరింత
నిండిన చెరువులతో ఊరంతా పులకరింత..
దోబూచులాడిన దొంగాటకు ఇక తెర పడినట్టే
ఈ రోజు నా నేల మీద పొర్లాడిన గోదారి
ఇక తెలంగాణ దారుల వెంట పచ్చని గాలై కమ్ముకుంటుంది
ఎండిన నేలను, ఎగిరే దుమ్మును
తన తడి స్పర్శతో తైల్లె హత్తుకుంటుంది
పంటల మీద పక్షుల జోరు
పిల్ల బాటన కైకిలి సందడి
బండి గిర్రలు, నాగలి కర్రులు
ఎద్దుల గిట్టలు, పెద్ద గుమ్ములు
ఇప్పుడు మళ్లీ మొలకెత్తే పాత గుర్తులు –
తెలంగాణ కొప్పులో కాళేశ్వరం
నీటికి నడక నేర్పిన మహోజ్వల ఘట్టం
ఎండిన స్తన్యం
ఎండమావులు ఇక చరిత్రే
ఇక నేల నేలంత నీటి ఊట
నేటి కొత్త నీటితో రేపటి
బోనం తలంటుకుంటది
తంగేడు పూవు తనువారా ఆటాడుకుంటది
వాడవాడంత డప్పుల దరువు
కాళ్ల గజ్జెలకు కొత్త నెలవు
నీరు ఎత్తు నెరుగు
తెలంగాణ పంటై వెలుగు
ఒద్దిరాజు
ప్రవీణ్‌కుమార్
98490 82693