మేఘం మనసు విరిగి
తునకలుగా రాలుతూ
కన్నీటి సందేశమై విప్లవిస్తున్నది
పసిపాపల పెదాలపై విషపు గుర్తులు
యవ్వనం నడకల్లో వృద్ధాప్యపు ఛాయలు
వీచే గాలి మొలిచే మొలక
రాలే చుక్క పారే పదన
పండే పండు నడిచే బతుకు
అసహజత్వపు లోతుల్లో
కూరుకుపోయిన ప్లాస్టిక్ వాసనలు
రసాయనాల్లో ముంచిన
భూమి తల్లికి అభిషేకమేమో!
హే… రైతేంది రాజయితేంది
జానెడు పొట్టను
బానగ మార్చిన పేరాశల పర్వం
ప్రకృతి వికృతిగ మారిన నాడు
మనిషి శూన్యపు తిత్తే
అకాలం కావచ్చు
అకారణం మాత్రం కాదు
భూమి తల్లి వేడి నిట్టూర్పుల
ఆర్ధ్రతా కంటి శోష
పేరుకుపోయిన కృత్రిమ
మేఘాల కంఠశోష
సంద్రాలు సైతం
కలుషిత కల్లోలపు వలలో చిక్కుకొని
కృత్రిమ మేఘాలను కంటున్నప్పుడు
కురిసేది కన్నీటి జలపాతమే
మనిషి తవ్వుతున్న గోతిలో
కాలాలు సైతం కంగారులో
తలకిందులవుతున్న తరుణం
వికటించిన కాలం కాటుతో
మనిషి మనుగడ అతలాకుతలం
కుండపోతలు గుమ్మరించినా
వాగుల మరకలేగాని
ఊటల దారులు లేవేం
తీయని నడకల నెవరెత్తుకెళ్ళినట్టు
చిరిగిన ఓజోన్ తెరపై
రాక్షస గుర్తులు ఎక్కడివి
అరణ్యాలను ఎత్తుకెళ్తున్న నగరాలు
గుట్టలను మింగేస్తున్న మైదానాలు
పచ్చదనపు ఆచ్ఛాదనాన్ని
చింపేసుకుని
భూమిని నగ్నంగా
ఆక్యుపంక్చర్ చేస్తున్నప్పుడు
పడేవి అబ్నార్మల్ వర్షాలే!
డా.శారదా హన్మాండ్లు
9912275801