రుబాయిలు అనగానే ఉర్దూలో ‘గజల్’, ‘షాయిరీ’ వంటి మధురమైన భావం సన్నటి పొరలా మనసును కమ్ముకుంటుంది. భావుకతకు భాషతో సంబంధం లేదు. వ్యక్తీకరణకు నియమాలు అవసరం లేదు. గజల్, రుబాయి వచనం ఏదైనా పాఠకుడిని కదిలించేదిగా ఉండాలి. అతి మామూలు పదాలు కూడా కవిత్వంలా మారిపోయే భాషా సౌందర్యం మనసును హత్తుకుంటుంది.
కొన్ని ‘గజల్’లు ఎప్పుడో విన్నప్పటికీ అలా గుర్తుండి పోతాయి. దీనికి వాటిలో భావం కారణమా, శైలి కారణమా, అనుభూతియా… ఏదయినా కావచ్చు. అన్నీ అయ్యుండవచ్చు. ఇది ఎక్కువగా ఉర్దూ గజల్స్ లో, హిందీలో కనబడుతుంది.
తెలుగులో ‘రుబాయిలు’ అన్నప్పుడు తాత్వికత, విఫలప్రేమ, అనుభూతి ప్రధానమైనవి మాత్రమే అని అప్పటి వరకు చూశాం. కాని వీటికి భిన్నంగా ఏనుగు నరసింహారెడ్డి ‘రుబాయిలు’ కనిపిస్తాయి. వైవిధ్యమైన వస్తు సేకరణ కనిపిస్తుంది. రుబాయిలలో ఒక రైతు కన్నీటిని, వానలేక కన్నీళ్ళతో తడిసిన మట్టిని, తెలంగాణకు చుట్టిన సిరిసిల్ల చీరలాంటి రుబాయి ఏనుగు నరసింహారెడ్డిది.
‘సిరిసిల్ల చీరలల్ల ఉంది సోయగం నిర్మల్ లక్క బొమ్మల్లొ ఉంది సోయగం’ అంటాడు ఆయన.
వీరి రుబాయిలలో తాత్వికత కనిపిస్తుంది. ఆ తాత్వికత ఎక్కడో దూరంగా చిన్నప్పుడు పదాలు పాడుకుంట పోతున్న ఏదో గొంతుక మన కనుల ముందు నుండి నడుచుకుంటూ, తెల్లారి ఉదయపు మంచుతెరలలోకి పయనమవుతున్న రూపమొకటి మనల్ని దాటుకుంటూ పోతున్నట్లు ఉంటుంది. ఊరిని వాన పెనవేసిన దృశ్యాలు, ఆకాశం భూమితో మాట్లాడుతున్న ముచ్చట్లు, వానలేక ఎండిన గొంతుకల గీతమై వినిపిస్తుంది.
తెలంగాణ అనగానే మెరుపులా కనిపించేది బతుకమ్మ పండుగ. ‘చెట్ల మీద నిగారించు కట్ల పువ్వులు/ పులకరించు రంగుల గులిమాల పువ్వులు; సద్దుల బతుకమ్మలకు స్వాగతమంటూ/ గుడిసె కొప్పుమీద నవ్వు బీర పువ్వులు..’ అంటూ బతుకమ్మను కీర్తిస్తాడు.
మనిషి మనసు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణం సమూహం నుండి ఒంటరితనంలోకి, ఒంటరితనం నుండి సమూహంలోకి. ఈ పయనంలో అనేక సంఘటనలు, అనుభూతులు, ఊహలు, భావుకతతో నిండిన ఆలోచనలు అలలై తాకుతూనే ఉంటాయి.
‘చెట్ల మీద వాలేందుకు పిట్టలు తిరిగొచ్చినై/నీటిలోన ఈదాలని చేపలు తిరిగొచ్చినై…; రేగు చెట్ల పండ్ల తీపి ఎరిగినోళ్ళమే/పరిక పండ్ల జిగురు రుచి ఎరిగినోళ్ళమే; ముండ్ల వనం మూలమంత తెలిసినోళ్ళమే/ పుట్టుక నుండి పోరి పోరి బతికినోళ్ళమే…’
గతాన్ని మరువని మనిషి… ఎప్పటికప్పుడు హృదయాంత రాలలో దాచుకొన్న అనేక అనుభవాలకు అక్షర రూపం ఇస్తూపోతే అదే ఏనుగు నరసింహారెడ్డి రుబాయిల ప్రవాహం. మనిషి మనుగడకు చెట్టు, అడవి అవసరం. ఆ అడవినే నరుకుతూ కాంక్రీటు అడవిని పెంచుతున్న మనిషికి ఒక ప్రశ్న,
ఒక చురుకై తాకుతుంది.
‘కాలే కడుపులతో అలసినప్పటి రోజులు/ ఖాళీ జేబులతో తిరిగినప్పటి రోజులు…; చెప్పిన పాఠాలే ఏ గురువు చెప్పలేడు/ దిక్కుతోచని పక్షులైనప్పటి రోజులు…’ జీవితం ఎంత అనుభవం ఇస్తే ఈ అక్షరాలు అల్లుకుంటాయి. మనిషికి గతం ఇచ్చిన అనుభవాలే వర్తమానంలో మనలను నడిపిస్తాయి. వర్తమానపు బాటలు అయితయి. ఇప్పటి ఈ నడకకు అప్పటి ఆ జీవనం కంటే గొప్ప గురువు ఉంటాడా? సాంకేతికంగా మనిషి చాల గొప్ప స్థాయిలో ఉన్నాడు. కానీ దానిని గౌరవిస్తూనే మానవత్వాన్ని మరువకు అనే భావన మనలను ఆలోచనలో పడేస్తుంది. వైవిధ్యభరితం, అనుభూతుల మాల అయి మన మనసులలో ఏనుగు నరసింహారెడ్డి ఈ తెలంగాణ రుబాయిలు జీవ నదిలా, ప్రవాహమై సాగుతూనే ఉంటాయి.
-సీహెచ్. ఉషారాణి, 94412 28142