e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home సాహిత్యం ద్రవిడ సంస్కృతికి మన బోనం

ద్రవిడ సంస్కృతికి మన బోనం

ఆషాఢ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ బోనం! మొదటినుంచీ భారతీయ జీవనం, సంస్కృతి, తెలంగాణ జీవన శైలి అంతా కూడా ప్రకృతితో మమేకమై, పర్యావరణానికి అనుకూలమైన జీవనవిధానంతో కూడింది! కాకపోతే వేర్వేరు కారణాల వల్ల పెరిగిన పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, పట్టణీకరణ వంటి వాటివల్ల ప్రస్తుతం ఎన్నో పరిణామాలను భారతీయ సమాజం ఎదుర్కొంటూ వస్తున్నది. ఎన్నో మార్పులను అనివార్యంగా ఆహ్వానించి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నది. ఆ క్రమంలోనే గ్రామీణ జీవనశైలికి సంబంధించిన పండుగలు కూడా రూపురేఖలను మార్చుకోవడం, మరికొన్ని పండుగలు కనుమరుగైపోయాయి కూడా. కానీ బోనాల పండుగ ఇప్పటికీ ప్రజాదరణతో కొనసాగడం విశేషం!

గ్రామీణ జీవన సంస్కృతికి, పల్లె జీవన విధానానికి, ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ!

- Advertisement -

ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక! ఆదిమ ఆధ్యాత్మికతకు భక్తి తత్వానికి కొలువైన జయగీతిక! మన కట్టు, మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ, మన పేరిణి..

తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో ప్రజలందరినీ చైతన్యపరిచిన పంచ సూత్రాలివి.! ‘బోనం’ అనే పదం భోజనం అనే పదం నుంచి కాలక్రమంలో రూపొందినట్లుగా భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

‘బోనం’
అనే మాట గ్రామ్య పదంగా
ఉన్నప్పటికీ, సంప్రదాయపరంగా
ఆచరణలో అది మాతృ దేవతల
ఆరాధన, సాటిమనిషి సంరక్షణ,
మెరుగైన భవిష్యత్తు కోసం ఆరాటం,
ప్రకృతి శక్తులను సంతృప్తి పరచడం
వంటివన్నీ కలగలిసి ఉన్నాయి.

బోనం- మానవజాతి పరిణామ చరిత్రే:
తొలినాటి సమాజంలోని అన్ని అంశాలకు మూలం స్త్రీ ప్రాధాన్యం, స్త్రీ ఆధిక్యత, స్త్రీని అనుసరించి ఉన్న విధానాల కూర్పు. అందుకే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వగలిగిన బోనాల పండుగ ఆదిమకాలం నుంచే మొదలైందని చెప్పవచ్చు. స్త్రీ దేవతారాధన స్త్రీ ఆధిపత్య సమాజంలో మాత్రమే సాధ్యం. తొలినాటి సమాజాల విశిష్ట లక్షణం ఇది. దీనికి ఉదాహరణ బోనాల పండుగ!

చారిత్రక కోణంలోంచి విశ్లేషిస్తే సింధూ నదీ నాగరికత కాలంలో ఇద్దరిని మాత్రమే దేవుళ్లుగా ఆరాధించే సంప్రదాయం ఉంది. ఒకరు అమ్మ తల్లి అయితే మరొకరు పశుపతి. సింధూ నదీ నాగరికత కాలం- నదీలోయ ప్రాంతంలో వ్యవసాయం ద్వారా పంటలను పండిస్తూ, కావలసిన ఆహారాన్ని సృష్టించుకుంటూ స్థిర జీవనం గడుపుతున్న దశకు చెందినది. దాంతో పాటు వారికి పశువులను మచ్చిక చేసుకోవడం, పశు పాలన అనే విద్య కూడా తెలుసు. అందుకే ఆ పశువులకు ప్రతినిధిగా, ఆ పశు సంపదను కాపాడే దేవుడిగా పశుపతిని పూజించడం ప్రారంభమైంది. సమాజంలో ఉండే వ్యక్తుల సంఖ్యను పెంచడానికి, సంతానాన్ని ప్రసాదించే శక్తి స్త్రీకి మాత్రమే ఉన్నందువల్ల స్త్రీని ఆరాధించడం మొదలై ఆమెను అమ్మ తల్లిగా కీర్తించడం కూడా అప్పట్లో వాడుకలో ఉందని చారిత్రక ఆధారాలను బట్టి, పురావస్తు తవ్వకాల్లోని విశేషాలను బట్టి అవగతమవుతుంది. ఇంతటి చారిత్రక ప్రస్థానంలో ఎన్నెన్నో సంప్రదాయాలు, ఆచారాలు కనుమరుగైపోయాయి. కానీ ప్రాచీనకాలపు అమ్మతల్లి ఆరాధన నేటికీ సజీవంగా కొనసాగుతుండటం విశేషం!
ద్రవిడ సంస్కృతి మూలాలు : ద్రవిడ సంస్కృతికి పట్టుగొమ్మగా ఉన్న దక్షిణ భారతంలో మాత్రం అమ్మ తల్లి ఆరాధన, మాతృస్వామిక సమాజాల ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్నాయి. తెలంగాణ కూడా పల్లె జీవన సంస్కృతికి పట్టం కట్టే నేల. ప్రస్తుతం హైదరాబాద్‌-సికిందరాబాద్‌ లాంటి జంటనగరాలు ఎంతో ఆధునికతను, అభివృద్ధిని సాధించినప్పటికీ పల్లె జీవన ఆత్మను మాత్రం పోగొట్టుకోకపోవడం విశేషం. హైదరాబాద్‌ మెట్రో నగరంగా ఎదిగిన తర్వాత కూడా మహానగరపు హృదయం మాత్రం పల్లె జీవనంలోనే ఉందనే విషయాన్ని ఏటా గుర్తుచేసే ఉత్సవంగా బోనాల పండుగ ఇప్పుడు దర్శనమిస్తున్నది.

పర్యావరణ ప్రయోజనాలు: బోనాల పండుగలో ఉత్సవం మాత్రమే లేదు. పర్యావరణపరంగా ఎన్నో ప్రజా ప్రయోజనాత్మక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆషాఢమాసంలో వానకాలం మొదలవుతుంది. ఈ కాలంలో కురిసే వానల వల్ల వచ్చే కొత్త నీరుతో కొన్ని వ్యాధులు రావడం సహజం. ప్రధానంగా ఈ వ్యాధుల పాలిట పడేది చిన్నపిల్లలే! దీన్ని గమనించిన ప్రజలు వందల ఏండ్ల కిందటే ‘బోనం’ పేరుతో అమ్మ తల్లి ఆరాధనకు అంకురార్పణ చేశారని భావించవచ్చు.

అమ్మ తల్లి, మాతృదేవత, గ్రామ దేవతల పూజ వెనుక ఉన్న ప్రధాన సంకల్పం సంతాన సంరక్షణ, ప్రజారక్షణ. ఈ బోనాల పండుగలో ఉపయోగించే పదార్థాలన్నీ సూక్ష్మజీవి నాశకాలుగానూ, రోగనిరోధకశక్తిని పెంచేవిగానూ, వ్యాధులను ప్రబలకుండా నియంత్రించేవిగా పరిశోధనల్లో తేలడం ఇక్కడ ప్రస్తావనార్హం. శివసత్తులు, బోనాలు ఎత్తుకున్న ఆడబిడ్డలు.. వారి వస్త్రధారణ, వారు వాడే పసుపు ఇతర అంశాలకు సంబంధించిన వాటన్నింటినీ లోతుగా గమనిస్తే ఇది స్పష్టమవుతుంది.

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం: బోనాల ఖ్యాతిని ప్రపంచానికి విస్తరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఉత్సవాన్ని అధికారిక పండుగగా ప్రకటించారు. ప్రజలు భక్తిపూర్వకంగా, స్వచ్ఛందంగా జరుపుకొంటున్న ఉత్సవాలకు ప్రభుత్వం కూడా తోడవడంతో ఏడేండ్ల నుంచి బోనాల పండుగ కనీవినీ ఎరగని రీతిలో ప్రచారాన్ని, ఆదరణను సాధించింది. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులను సమకూర్చడం ప్రశంసనీయం. 2015లో బడ్జెట్‌లో రూ.5 కోట్లను కేటాయించిన ప్రభుత్వం క్రమంగా ఈ నిధులను రూ.15 కోట్లకు పెం చింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భాషా సాంస్కృతిక శాఖ ఎన్నోరకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. పలు దేవాలయాల వేదికల వద్ద సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడంలో సఫలీకృతమైంది. ప్రజల ఆకాంక్షలకు, ప్రజల్లో స్థిరపడిన సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని అన్ని దిశల్లో విస్తరించేలా కృషిచేస్తున్నది.

వేపాకులు, బెల్లం సాకలు, పసుపు, గంధం పూతలు, నిమ్మకాయలు, పోతురాజు దేహం నిండా పూసిన పసుపు, కుంకుమ అలంకారాలు దీనికి ఉదాహరణలు. బోనం ఎత్తుకొని వెళ్లేటప్పుడు ఊరేగింపుల్లో పోతురాజులు, శివసత్తుల పూనకాలు, వారి చిందులు, వీర నృత్యాలు, కొరడా ఝళిపింపుల ద్వారా, నేల, గాలి అంతటా పసుపు వెదజల్లబడి వ్యాప్తి చెందుతాయి. ఇవన్నీ గాలిలో, నేలపై, నీళ్లల్లో ఉండే సూక్ష్మజీవులను, ప్రాణాంతక వ్యాధులను ప్రబలం చేసే సూక్ష్మక్రిములను అంతం చేస్తాయి. అందుకే బోనాల పండుగ ఎంత సంప్రదాయ పండుగో, అంతే సంక్షేమ పండుగ! ప్రస్తుత కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించే ప్రతిరక్షక వ్యవస్థను పెంపొందించే ఆరోగ్య అంశాలు ఈ బోనాల సంప్రదాయంలో నిబిడీకృతమై ఉన్నాయని పరిశోధకులు చెప్తుండటం గమనార్హం.

మామిడి హరికృష్ణ
80080 05231

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana