ఈ మధ్య మా ఊళ్ళో
ఓ పుణ్యాత్ముడు
ఒక చెరువు తవ్వించాడు
ఎగువన కురిసిన వర్షానికి
వచ్చే నీళ్ళలా
ఎక్కడెక్కణ్ణుంచో పుస్తకాలు
జలజలా ప్రవహించి
ఆ తటాకపు అల(ల)మారల్లో
కనువిందు చేస్తున్నాయి
ఇప్పటివరకూ
తెలిసో తెలియకో
చెరువు మీద అలిగి
అజ్ఞానపు బురద అంటించుకున్న
ప్రతి ఒక్కడూ
రేపు ఈ రేవుకొచ్చి
కాళ్ళు కడుక్కోకా తప్పదు
పుస్తకాన్ని
తన కళ్ళకు అద్దుకోకా తప్పదు…
నలిమెల భాస్కర్