జీవనం ఎప్పుడూ
వొంపేసుకున్న ద్రావణం కాదు
మళ్లీ మళ్లీ బతుకు బొచ్చెలోకి ఎత్తుకోవటానికి
ప్రతీ బతుక్కు కొన్ని పరిమితులుంటాయి
కొన్ని స్వేచ్ఛలుంటాయి
కొన్ని హద్దులుంటాయి
అవి లేకుంటే అది బతుకే కాదు
ప్రతి మనిషికీ కొన్ని రహస్యాలూ అవసరమే
జీవితమంతా.. తెరిచిన పుస్తకమేమీ కాదు
ఆసాంతం చదివేయటానికి
కొన్ని పుటల్ని గుర్తుకోసం
మడత పెట్టుకోవాలి….
కొన్ని కాగితాల్ని మన కోసం
దాచి పెట్టుకోవాలి అది అంతే..
అవి మనల్ని అప్పుడప్పుడూ
అద్దంలో దిగంబరంగా
చూపిస్తూ హెచ్చరిస్తూ ఉంటాయి
మనకు మనమే సమాధానం చెప్పుకొంటాం
గనుక మనోనిబ్బరంగా ఉండిపోతాం..
మన రహస్యం మన గుప్పిట్లోనే ఉంటుంది
గనుక ఆ అవిటితనాన్ని
పదేపదే జయిస్తూ ఉంటాం..
ఏ మనిషైనా జీవితాన్ని
సంపూర్ణంగా సహజంగా వొంపుకొన్నడంటే
అది నిజమై ఉండక పోవచ్చు
నిజాన్ని నిండుగా ఆవిష్కరించుకుంటే
వెగటు తనం
పరిపరి విధాల వెక్కిరిస్తూనే ఉంటుంది
నిర్లజ్జగా అంతా వొంపుకోవటం
వెకిలి తనమో వెర్రిబాగుల తనమో అవుతుంది
జీవితమంటే…! నాలుగోడల మధ్య
సాఫీగా బతికెయ్యటం కాదు
నువ్వే ప్రపంచమైన వారికి
ఓ కొత్త ప్రపంచాన్ని చూపించటం
చెలిమి దారంతో
ప్రేమ బంధాల్ని పేనుకోవటం
గుండె నిబ్బరంతో స్వేదనా రాగమై
నిన్నంటి పెట్టుకున్న బతుకు బోగీలను
సమున్నత గమ్యానికి చేర్చటం
సుఖ దు:ఖాలతో
సుదూర తీరాలకు జీవనదిలా ప్రవహించటం..!!
డాక్టర్
కటుకోఝ్వల రమేష్
9949083327