మరాఠీ, కన్నడతో పాటు మరికొన్ని భాషల్లో కూడా హరికథ ఉన్నా తెలుగు హరికథ పరిపుష్టమైనది. అవధానంలా తెలుగువారికి ప్రత్యేకమైనది. వాల్మీకి మహర్షి నేర్పిన రామాయణాన్ని తొలిసారి ఆయన ఆశ్రమంలోనే పాడిన లవకుశులదే మొదటి హరికథ అంటారు. అక్కడినుంచి ఒక ఆధ్యాత్మిక గంగా ప్రవాహంలా హరికథ కథలు కథలుగా కొనసాగింది.
ఆధునిక కాలంలో హరికథను హిమాలయమంత ఎత్తుకు తీసుకెళ్లినవాడు ఆదిభట్ల నారాయణదాసు. హరికథా పితామహుడు అని లోకం ఆయన్ను వేనోళ్ల పొగిడింది. గొంతెత్తి పాడి ప్రపంచాన్ని ఇక్షుసాగరంలో ముంచి తేల్చిన గాయకుడు. గద్యం, పద్యం, శ్లోకం, జానపదం ఎలా పాడాలో తెలిసినవాడు. ఆశువుగా పద్యాలు, శ్లోకాలు అల్లి శ్రోతలను ఊపేసినవాడు. అసాధారణమైన జ్ఞాపకశక్తి ఉన్నవాడు. ధారణకు తోడు అమృతతుల్యమైన కవితా ధార ఉన్నవాడు. ఆయనను కేవలం హరికథకుడిగా చూస్తే తెలుగు సాహితీలోకం తనను తాను తక్కువ చేసుకున్నట్టే. ఇలాంటివాడొకడు ఉండేవాడా? అని ఆశ్చర్యపోవాల్సిన అద్భుతమైనవాడు ఆదిభట్ల. ఆయన చూపిన నవీన మార్గంలో నడుస్తూ… హరికథా గానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు కోట సచ్చిదానంద శాస్త్రి (1934-2024).
సంగీత నాటక అకాడెమీ అవార్డు, ఆదిభట్ల నారాయణదాసు పురస్కారం, హంస అవార్డు మొదలు పద్మశ్రీ అవార్డు దాకా ఎన్నెన్నో అవార్డులు పొందిన కోట సచ్చిదానంద శాస్త్రి దేశ, విదేశాల్లో దాదాపు ఇరవై వేలకు పైగా హరికథలు చెప్పారు. ఇప్పుడంటే లెక్కలేనన్ని సాంకేతిక వెసులుబాట్లు. వెనుక ఎల్ఈడీ స్క్రీన్లో దూరం నుంచి అందరికీ స్పష్టంగా కనపడటానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు. ఇవేమీ లేని రోజుల్లో వందల, వేల మంది కళ్లప్పగించి చూసేలా, చెవులప్పగించి వినేలా కోట ఎలా హరికథలు చెప్పారన్నది తెలుసుకోవాల్సిన విషయం. సంగీత, సాహిత్య, నృత్యాభినయాల సమాహారం హరికథ. అవధానిలా పద్యాలు, పాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. గాయకుడిలా రాగయుక్తంగా పాడాలి.
నృత్యకారుడిగా కాళ్లు, చేతులు కదిపి నాట్యం చేయాలి. నటుడిలా మొహంలో సందర్భానికి తగినట్లు అభినయించాలి. ప్రవచనకర్తలా వ్యాఖ్యానం చెప్పాలి. సాధారణ శ్రోతలకు విసుగు పుట్టకుండా పిట్టకథలు చెప్పాలి. అవసరమైతే సందర్భానికి తగిన సినిమా పాటలు పాడాలి. సమకాలీన అంశాలతో ముడిపెట్టి ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలి. ఏక కాలంలో హరికథకుడు ఇన్ని అవతారాలు ఎత్తాలి. ఇలా అన్ని అవతారాలెత్తిన హరికథకుడు కోటకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. 1960-80ల మధ్య కోట హరికథ ఒక జైత్రయాత్రలా సాగింది. హరికథల్లో సినిమా పాటలు పాడటం, స్థానిక విషయాలను ప్రస్తావించడం మీద సంప్రదాయవాదులు వ్యతిరేకించినా ఆయన లెక్క చేయలేదు. పొలంలో పని చేసుకునే సామాన్యుల ముందు అద్వైతం, విశిష్టాద్వైతం, తాత్విక రహస్యాల గురించి చెప్పడానికి బదులు వారి స్థాయికి దిగి… వారికి తెలిసిన పరిభాషలోనే, వారికి తెలిసిన పోలికలు, ప్రతీకలతోనే హరికథ చెప్పడం నా పద్ధతి అని ఆయన అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు.
ఏ కళ అయినా సమకాలీన వాతావరణానికి, కొత్త తరం అభిరుచులకు అ నుగుణంగా మలచకపోతే మనుగడలో ఉండదన్న సత్యాన్ని గ్రహించి, సంప్రదాయ హరికథకు కొత్త మెరుగులు దిద్దినవాడు కోట సచ్చిదానంద శాస్త్రి.
(సెప్టెంబర్ 16న కన్నుమూసిన కోట సచ్చిదానంద శాస్త్రికి నివాళిగా)
– పమిడికాల్వ మధుసూదన్99890 90018