మెట్లెక్కుతున్న కొద్దీ
కాలికి లేపనం పూసినట్టు,
అవి ఆకాశ సోపానాలు
అయినట్టు ఉంటుంది
కిందికి చూస్తే మురికి మురికిగా
కుక్క పొదుగులో దూరి
పోట్లాడుకుంటున్న
పిల్లల్లా కనిపిస్తుంటారు
చాలా మందికి తెలియదుపైకి
యెక్కినవారు తమవారు కారని,
తమతోపాటు పొద్దుపొద్దున
చుట్ట కాల్చుకోడానికి
తమ కుంపటి వద్దకో
చలి మంటకాడికో
వచ్చినవాడే తమవాడని
వారికి బొత్తిగా యెరుక వుండదు
చెట్టెక్కబోయి పడిపోయి
మక్కెలు విరిగినప్పుడు, కాలు
కట్టె పుల్లలా పుటుక్కుమన్నప్పుడూ
వచ్చి పరామర్శించేవాడు,
ఆసుపత్రికి గూడుబండి కట్టేవాడే తమవాడని బొత్తిగా గ్రహింపు రాదు,
నేలను మరిచిపోయిన కాలు
పుచ్చిపోయిన కర్ర కంటే హీనం,
విమానంలో యేరు దాటి, సప్త సముద్రాలను లంఘించేవాడికి నీటి తడి, కెరటం వడి ఎలా అర్థమవుతుంది
రోడ్డు పక్క ఆకలి పేగుల కోసం
పెద్ద పెద్ద హోటళ్లలో
తిని మిగిల్చిన ఆహారాన్ని
అందమైన ప్యాక్లలో సేకరించేవారు
నిజంగానే దేవుళ్లను తలపిస్తారు,
కార్పొరేట్ల కాలి కింది భూగోళాన్ని
ఖాళీ చేయిస్తే ఈ బాధ ఉండదు కదా అంటే వారు ఒప్పుకోరు,
పోరులో తోడుండేవారు ఎప్పుడూ సాటివారే, పట్టపగలు నిప్పుల వానలో మురికిని వదిలించుకునేవారే
-నిజం