మూసీ మీదికి గంగ తెప్పను తోలు కవీ
ఇప్పటికిప్పుడే తోము ఆర్సినిక్ కార్బైడ్‌ను
విరిగిపోయిన కత్వా కాళ్లను, చేతల్ని సాఫ్ జెయ్
సక్కగ జెయ్ బారజాపియ్యి
మూతి సక్కగ జెయ్యి కవిత్వానిదీ
కత్వాది.
మనోళ్లందరిదీ నల్లగొండ నలుపేరా
మన రక్తం గూడా నలుపే
కురిసే వాన గూడా నలుపే నాయనా
గోర్వెచ్చని పాటగాడా
మీట జరుపు మెట్టు జరుపు
నలుపెత్తు
నాగలి నవరంధ్రాలకు నాల్కెను మొలిపించు
సర్కార్ తుమ్మలను నాకించు
విషమిరుగుతది రాజకీయులది
పాచి పగలది
పానాది పగుల్లది
పరుపు తాళ్లది ఈనె గుండ్లది
మూసీ.. నా మూసీ
నీ బొడ్డు సంచిని ఎన్నిసార్లని
విప్పి చూసినమే
ముత్తెమంత పానాలను ఎంతని
తవ్వుకుంట పోయినమే అవ్వా
నెయ్యి బువ్వను ఎంతని
సాగదీసుకుంటా ఈడ్చుకుంట పోయినమే
నల్లగుండోల్లము
దునియ మొత్తం సల్లగుండాలని
కోరుకునేటోల్లము
త్యాపత్యాపకూ తాగినోళ్లము
మూసీ మలుపుల నలుపు నీళ్లను
కలేజకు పూసుకున్నోళ్లము
మన భాషకు మాలిష్ తేల్తో
మూసీ గుండె సప్పుడుతో
తాగించినోళ్లము
మా అయ్యగాదు.. జెరంత కదులు
కొంచెం జరుపు
పాత తొవ్వని కలుపుకుపో
ఆ కత్వ
నా తొవ్వ
తొల్కపో…
అగొనే…
– సిద్ధార్థ 73306 21563