మాటల్లోనే స్టేజీ వస్తుంది
బస్సో, రైలో, విమానమో దేంట్లోనూ
పక్క సీటెవరన్నది ఎవరమూ ఊహించం
ఎక్కి కూర్చున్నాకో, కాస్త కదిలాకనో
మొదలవుతుంది సింక్రోనిక్ టైం-
చిన్నదో, పెద్దదో
సీటుకో కథ ఉంటుంది
కథకో వ్యధ, లొకేషన్, వేడి వేడి కన్నీళ్లూ,
దిమ్మ తిరిగే మలుపులూ, ముగింపూ ఉంటాయి-
గొప్ప విషయమేమంటే
దిగిపోయే సమీప దూరాల్ని బట్టి కథలకు
అవసరం స్కేలుగా అందమైన ఎత్తుగడ
కుదింపులు మృదువైన పొడిగింపులూ ఉంటాయి-
చెప్పరాకపోవడమనే సమస్యే తలెత్తదు
ఎందుకంటే ఎవరి కథ వాళ్లు చెప్పుకోవడంలో
అందరూ సిద్ధహస్తులు శిల్పాగ్రేసరులు
బెంజమిన్ ఫ్రాంక్లిన్లే-
అయినవి కానివి కలెయ్యడాలుండవు
అక్కరలేని చోటకు సింథటిక్ చొరబాట్లుండవు
సర్దుకు కూర్చోవడం నేర్పిన సీట్లే
చాలా సర్దుబాట్లను
కథల అంతరాత్మలకు ప్రసరిస్తాయి-
దిగేటప్పుడు
లగేజీలో ఏదన్నా మరచిపోతారేమో కాని
ప్రయాణంలో విన్న ఏ కథనూ ఎవరూ మరచిపోరు
ఒకదానితో ఒకటి పోలికలున్న కథలన్నీ
ఫోన్ నంబర్లు అడుక్కుని
వినమ్రంగా సేవ్ చేసుకుంటాయి
పరస్పరం వాట్సప్ స్టేటస్ పెట్టుకుంటాయి
వైడ్ యాంగిల్లో ఈ నంబర్లు చెప్పుకొనే
పోస్ట్ జర్నీ కథలు మరింత డెలిసియస్గానూ
క్లీన్ అండ్ టైడీగానూ ఉంటాయి
తీస్తే ‘ద గ్రేట్ ఎస్కేప్’ వంటి
సూపర్ హిట్ సినిమాలు అవుతాయి-
కథల్లోపల కరకట్టలకూ
కథాంతర కథల పుట్టుకలకూ, పునరావృతికీ
కథకులే బాధ్యులని ప్రతి సీటుకు తెలుసు
కాకపోతే కథా కాలజ్ఞానం
కథకులకే ఆలస్యంగా బోధపడటం అందరి కథల్లో
కొస మెరుపు
– డాక్టర్ బెల్లి యాదయ్య 98483 92690