వర్ణమాల నేర్చుకుంటేనే వర్ణాన్ని జయించినట్లు అనిపించేదని కందుకూరి నిప్పుల డప్పును మోగిస్తడు. రాజ్యం రెండు తలల పాము, అది ఎటునుంచైనా కాటేయగలదని అంజయ్య కలల నది అంచున పయనిస్తడు. కవిగా గుడిసె కొప్పు మీద విముక్తి జెండాను ఎగురవేయగలడు. ఆకాశం అరుగు మీద వెన్నెలను కాయించగలడు. అస్లీ కవిత్వం అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగులు విరాజిల్లే సూర్య కిరణమవుతుంది. అసమానతలు లేని సమాజాన్ని కోరుకునే ఎన్నెలై కురుస్తుంది. సామాజిక సమత్వం కోసం కందుకూరి కవిత్వంలో గడ్డి పోసలు గాండీవాలైతయి. పిచ్చుకలు పిడికిలి బిగిస్తయి. ఎత్తిన పిడికిళ్ళు పిడుగులై నినదిస్తయి. ఇంకా గోరువంకలు గొంతు విప్పుకుంటయి. పాలపిట్టలు పాటందుకుంటయి. అంబేద్కర్ చెప్పినట్టు చరిత్రను తెలుసుకోలేనివాడు చరిత్రను సృష్టించడు. బాబాసాహెబ్ వారసుడిగా కందుకూరి అంజయ్య తన చరిత్ర మూలాల్లో నుంచి అస్తిత్వ కవనమై మాట్లాడుతున్నడు.
‘కవిత్వం వేరు వచనం వేరు. సాదాసీదా డీలా వాక్యం రాసి, కవిత్వమని బుకాయించకు. కవిత్వాన్ని వంచించకు. వచనమై పేలిపోతావ్” అని త్రిపురనేని శ్రీనివాస్ ఏనాడో హెచ్చరించాడు. కందుకూరి అంజయ్య పాఠాలతోపాటు గుణపాఠాలను నేర్చుకున్న కవి. కాబట్టి సమకాలీన సామాజిక సమస్యలనే తన కవితా ఇతివృత్తాలుగా ఎంచుకున్నాడు. ఆయన రచనా శైలికి పలుకుబడులు, నుడికారం, లోకోక్తులు, జాతీయాలు, సామెతలు జీవం పోశాయి. ప్రశ్నించడం, ఎండగట్టడం, ధిక్కరించడం, కాకును సాధించడం లాంటివి కవిత్వంలో భాగమైనాయి. కందుకూరి ‘కట్టెపల్క‘, ‘జమిడిక‘ కవిత్వ సంపుటులపై రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వ్యాసకర్తలు ఇరవై రెండు వ్యాసాలను రాశారు. ఈ వ్యాసాలు ఆయా పత్రికల్లో వచ్చినాయి. వీటన్నింటినీ క్రోడీకరించి, పరిష్కరించి కూకట్ల తిరుపతి సంపాదకత్వంలో ‘వడపోత‘ కందుకూరి అంజయ్య కవిత్వానుశీలన వ్యాసాలుగా అచ్చేశారు. ఈ వ్యాసాలు అంజయ్య కవిత్వాన్ని విమర్శనాత్మకంగా విలువ కట్టినాయి. ఆయన కవితల్లోని ఉప సమూహాల ఉనికిని, తండ్లాటను ఎత్తిపట్టినాయి. వాటిల్లోని వస్తు వైవిధ్యాన్ని, అభివ్యక్తిని, శిల్పాన్ని, కవిత్వ నిర్మాణ రీతులను వివరించినాయి.
కూకట్ల తిరుపతి జమిడిక కవితల మోతను అస్తిత్వపు కళాత్మకతగా చిత్రిస్తూ, వడపోత సంపాదకీయంలో అక్షరాలు పూసిన అగ్నిపూలుగా అంజయ్య కవిత్వాన్ని అభివర్ణించారు. కందుకూరి కట్టెపల్కపై కవితాక్షరాలు చెదిరిపోని గురుతులని, పాలుపట్టిన జొన్నకంకుల రాశిగా ఆచార్య పిల్లలమర్రి రాములు, చైతన్య ప్రకాష్, బద్రి నర్సిన్, అన్నవరం దేవేందర్, బండారి రాజ్ కుమార్ సోదాహరణంగా పేర్కొన్నారు.
జమిడికను ఐ.వి.రమణ రావు, జి.వెంకటకృష్ణ ఉద్యమ ప్రేమికుల హృదయగానంగా, డా.ఉమ్మిడిశెట్టి రాధేయ ఆధిపత్యంపై గురిపెట్టిన సూపుడు వేలు తీవ్రతను చూపించారు. అంజయ్య అల్లికను అసమానతలపై ఎక్కుపెట్టిన అస్త్రమని పుప్పాల శ్రీరామ్, అనిల్ డ్యాని, కన్నెకంటి వెంకటరమణ, అన్నాడి గజేందర్ రెడ్డి, బూర్ల వేంకటేశ్వర్లు, దాస్యం సేనాధిపతి అవ్యవస్థలపై విలక్షణ అభివ్యక్తితో సంధించిన ప్రశ్నల పరంపరగా వివరించారు. ఉపసమూహాల సంఘర్షణలో పుట్టిన అస్తిత్వ కవిత్వమంటూనే గోపగాని రవీందర్, బుర్ర తిరుపతి, తోట నిర్మలారాణి, పెనుగొండ బసవేశ్వర్, తోట సుభాషిణి, తప్పెట ఓదయ్య, ప్రమోద్ ఆవంచ సామూహిక చైతన్యం దిశగా సాగిందని నిర్దేశించారు. కందుకూరి అంజయ్య కవిత్వాన్ని అంచనా వేయడానికి పరిశోధకులకు ఈ వడపోత వ్యాసాలు ఒక ఆకరంలా దోహదం చేస్తాయి. అంబేద్కర్ ఫూలే పెరియార్ అధ్యయన వేదిక అచ్చేసిన ఈ గ్రంథానికి డా.నలిమెల భాస్కర్, డా.సుంకర గోపాలయ్య అందించిన బ్లర్బులు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. అన్నవరం శ్రీనివాస్ గీసిన ముఖచిత్రం భావస్ఫోరకంగానూ ఉంది.
ఏ కవికైనా, రచయితకైనా తన రచనలను విశ్లేషించే, విమర్శించే, విలువకట్టే వ్యాసాలు తన జీవిత కాలంలోనే రావడం హర్షించదగిన అంశం. ఆ కవి మునుముందు రాసే కావ్యాల్లో గుణాలను ఒడిసి పట్టుకుని, దోషాలను పరిహరించుకుని ఉత్తమోత్తమమైన రచనలు చేయడానికి ఇలాంటి వ్యాసాలు తోడ్పాడతాయి. తన రెండు కవిత్వ పుస్తకాలపై ఇరవై రెండు మంది వ్యాసకర్తలు స్పందించడానికి కారకుడైన కందుకూరి అంజయ్య అభినందనీయుడు. సాహిత్యం మనిషికి ఉత్తమ సంస్కారాన్ని అలవరుస్తుంది. సమాజంలో మానవ విలువలు దిగజారిపోతున్న నేటి తరుణంలో ఇటువంటి ఉత్తమ సంస్కారాన్ని అందించే రచనలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
‘చారిత్రకమైన చైతన్యం పట్ల అవగాహన లేకపోతే, ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం‘ అంటాడు క్రిస్టఫర్ కాడ్వెల్. అలాగే అంజయ్య అక్షరాల అల్లికలోని ఆర్ద్రతను అర్థం చేసుకోవడానికి పాఠకునికి కొంతైనా చారిత్రక అవగాహన ఉండి తీరాల్సిందే. ఏ దయామయుడు/తప్పిపోయిన గొర్రెపిల్లకు దారి చూపలేదు/ఏ కరుణామయుడు/కాలుతున్న కడుపుకొలిమిని చల్లార్చలేదు/అవే గుడిసెలూ గుడారాలు/అవే చింపిరిపాకలు‘ – అంటరాని క్రీస్తులో అంజయ్య నిరుపేదల బతుకులను నిఖార్సుగా చిత్రించాడు. ఈ పాదాలు బోయి భీమన్న రాసిన గుడిసెలు కాలిపోతున్నై కవిత్వాన్ని గుర్తుకు తెస్తాయి. ‘గుడిసెలు కాలుతున్నవి, ఎవరివైయి ఉంటయి, ఇంకెవరివై ఉంటయి, మాల మాదిగలవే అయి ఉంటయి‘. అరిటాకు ముళ్ళూ చందంగా మారినా నిరుపేదల జీవితాలకు నిదర్శనం ఈ కవితా పాదాలు. ఇలా భాగ్యవిహీనుల ఆకలి కేకలను, ఆర్తనాదాలను, అంతరాలను అక్షరీకరించిన గుర్రం జాషువా, బోయి భీమన్న, ఉన్నవ లక్ష్మీనారాయణ, శివసాగర్, గద్దర్ ల కోవలో కందుకూరి అంజయ్య పయనిస్తాడు. ఇటాలియన్ సాంస్కృతిక మార్క్సిస్టు అంటోనియో గ్రాంస్సీ ప్రతిపాదించిన ఉప సమూహాల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న ఈ కవి జమిడికలో ప్రజల జీవితాలను సహజాతిసహజంగా చిత్రించాడు. బడుగు బలహీన వర్గాలు ఇకనైనా మేలుకోవాల్సిన అవసరముందని ఈ పొత్తం తెలియజేస్తున్నది.
-కూకట్ల తిరుపతి
9949247591