తెలంగాణ, దక్కన్ కళారంగానికి విశేష సేవలు అందించిన జగదీశ్ మిట్టల్ జనవరి 7న తన వందో ఏట హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఆయన 1925, సెప్టెంబర్ 16న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో జన్మించారు. 1950లలో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. పదో ఏట ప్రారంభమైన కళారూపాల సేకరణ దాదాపు 9 దశాబ్దాలపాటు అంటే ఆయన తుదిశ్వాస విడిచే వరకు కొనసాగింది. తెలంగాణ కళారూపాలకు ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టారు.
రాయల్ కోర్ట్ పెయింటింగ్‌లు, స్కెచ్‌లు మొదలుకొని తెలంగాణ స్క్రోల్ పెయింటింగ్ (కుల పురాణాల చిత్ర పటాలు), చేర్యాల నకాషా చిత్రాలు, బిద్రీ కళాఖండాలు, కరీంనగర్ ఫిలిగ్రీ, చేనేత డిజైన్స్‌తో పాటు బహమనీ, కుతుబ్ షాహీ, అసఫ్‌జాహీ కాలపు పెయింటింగ్‌లు, ఇత్తడి, రాగి, కంచు, వెండి, బంగారు, కళాఖండాలు, చారిత్రక ప్రాధాన్యం గల వస్తువులను దాదాపు 3 వేల వరకు సేకరించి మ్యూజియం ఏర్పాటుచేశారు. కళారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1990లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.
మిట్టల్ 1960, 70లలో చేర్యాల కళాకారులను గుర్తించి ప్రోత్సహించారు. ఇక్కడి చేనేత కళాకారుల డిజైన్, పెంబర్తి కళలను గుర్తించి ప్రచారం చేశారు. స్క్రోల్ పెయింటింగ్స్ గొప్పతనాన్ని, ప్రాముఖ్యాన్ని వివరిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ లో Deccani Scroll Paintings in the Jagdish and Kamla Mittal Museum of Indian Art అనే ప్రామాణిక గ్రంథాన్ని రాసి ప్రచురించారు. ‘దక్కన్ పెయిటింగ్’తో పాటు
పలు ఇతర పుస్తకాలు రాశారు. 1954లో ‘భారతీయ కసిదా’ అనే పుస్తకాన్ని సహ రచయితగా చేశారు.
జగదీశ్ మిట్టల్ సేకరణలో చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్ గురించి గొప్పగా చెప్తారు. మూడడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవైన స్క్రోల్ పెయింటింగ్ అయిన ఇది 1625 నాటిది. దీనిపై మార్కండేయ ముని, భావన రుషి చిత్రాలు నకాషీలుగా చెక్కి ఉన్నాయి. దీనిని ఆయన కునపులి వారి వద్ద కేవలం రూ. 500కు కొనుగోలు చేశారు. దీని వెనక కూడా ఓ కథ ఉన్నది. ఈ పాతబడిన స్క్రోల్ పెయింటింగ్‌ను వారు జల విసర్జన చేయాలని అనుకుంటున్న వేళ వారికి రూ. 500 ఇచ్చి మిట్టల్ దానిని కొనుగోలు చేశారు. ఇప్పుడు దీని ఖరీదు కోట్లలో ఉంటుంది. అలాగే, ప్రముఖ పహాడీ చిత్రకారుల్లో ఒకరైన నైన్సుఖ్ నుంచి ఆరు పెయిటింగ్లను కొనుగోలు చేశారు.
మిట్టల్ తన భార్య కమలతో కలిసి దేశంలోని వివిధ పత్రికలు, మ్యాగజైన్లకు భారతీయ కళలోని వివిధ అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. భారతీయ కళ, వారసత్వ పరిరక్షణ, ప్రోత్సాహానికి వీరు చేసిన కృషి అమోఘం. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వ్యవస్థాపక సభ్యుడైన మిట్టల్ దేశంలోని పలు మ్యూజియంలు, వర్సిటీలు, న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో భారతీయ కళలు, పెయిటింగ్‌లు, హస్తకళలు, జానపద కళారూపాలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. లండన్, లాస్ ఏంజెలెస్, చికాగో తదితర నగరాల్లో కళపై ఉపన్యాసాలు ఇచ్చారు. అగర్వాల్ సమాజ్ కళారత్న పురస్కారం, సనాతనధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం, యుధ్వీర్ అవార్డు, ఏపీ ప్రభుత్వం నుంచి 2006లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. అలాగే, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాచ్) వ్యవస్థాపక సభ్యుడిగా, తంజావూరులోని సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ పాలక మండలి సభ్యుడిగానూ పనిచేశారు.
మిట్టల్ మ్యూజియంలో 50 శాతం వరకు మినియేచర్ పెయింటింగ్స్, డ్రాయింగ్లు ఉన్నాయి. మ్యానుస్క్రిప్ట్‌లు, ఇస్లామిక్ కాలిగ్రఫీ, జానపద, సంప్రదాయ కంచు విగ్రహాలు, బొమ్మలు, టెర్రకోట వస్తువులు, దారు శిల్పాలు. దంతపు బొమ్మలు, గాజు వస్తువులు వంటి కళాత్మక చిత్రాలు ఉన్నాయి. అలాగే, క్రీ.పూ. ఒకటో శతాబ్ది నాటి ప్రాచీన కళారూపాలు మొదలుకొని మొఘల్, దక్కన్ పెయింటింగ్స్ వరకు ఉన్నాయి. 2015లో న్యూయార్క్‌లోని మెట్రో పాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ సుల్తాన్స్ ఆఫ్ డెక్కన్ ఇండియా, 1500-1700 వెల్త్ అండ్ ఫాంటసీ పేరుతో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో మిట్టల్ కళాఖండాలు ప్రదర్శించారు.
మిట్టల్-కమల దంపతులు భారత్‌కే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న ప్రముఖ ఆర్ట్ కలెక్టర్లు, చరిత్ర పరిశోధకులకు సుపరిచితమే. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ సతీమణి జాక్వెలిన్ కెన్నడీ, ప్రముఖ చరిత్రకారుడు డాల్రింపుల్ వంటి వారు హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మిట్టల్ ఇంటిని సందర్శించారు. మిట్టల్ దంపతులు వుడ్ కట్, ఎంబ్రాయిడరీలో కూడా కృషిచేశారు. కనుమరుగవుతున్న బాతిక్ కళకు సహకారమందించారు. వీరి చిత్రాలు సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, వారణాసిలోని భరత్ కళాభవన్, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌తో సహా వివిధ మ్యూజియంలలో కనిపిస్తాయి. కళల పట్ల ఉన్న ప్రేమతో మిట్టల్ తన ఇంటినే మ్యూజియంగా మార్చేశారు. ప్రస్తుతం దీనిని ఆయన మనుమడు, మనుమరాలు చూసుకుంటున్నారు. ఇతర మ్యూజియంల మాదిరిగా కాకుండా, దీన్ని సందర్శించడానికి ప్రత్యేక పద్ధతి ఉన్నది. ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సందర్శకులకు వారి సేకరణ మొత్తం చూపరు. నిర్ణీత రోజున వారికి ఆసక్తిగల వాటినే అందుబాటులో ఉంచుతారు. ప్రతి కళాఖండానికి మిట్టల్ వ్యాఖ్యానం ఉంటుంది. వాటిలో ప్రతి ఒక్క కళాఖండానికి ఒక కథ ఉంటుంది.
ఇండియన్ పెయింటింగ్, టెక్స్టైల్స్ స్టడీస్ అంశంపై 2025 జనవరి 9 నుంచి 11 వరకు 3 రోజుల అంతర్జాతీయ సెమినార్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూనే మిట్టల్ మరణించారు. అంతకు 13 ఏండ్ల ముందే ఆయన భార్య కమల మృతి చెందారు. తెలంగాణ, దక్కన్ కళలు, సంస్కృతి, వారసత్వాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి జగదీశ్ మిట్టల్ చేసిన కృషి అనన్య సామాన్యం.
మిట్టల్-కమల దంపతులు భారత్‌కే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న ప్రముఖ ఆర్ట్ కలెక్టర్లు, చరిత్ర పరిశోధకులకు సుపరిచితమే. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ సతీమణి జాక్వెలిన్ కెన్నడీ, ప్రముఖ చరిత్రకారుడు డాల్రింపుల్ వంటి వారు హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మిట్టల్ ఇంటిని సందర్శించారు.
-దుర్గం రవీందర్
93464 54912