‘కపిలవాయి లింగమూర్తి వాయి గొప్పది, చేయి గొప్పది. నిరంతర రచనా వ్యాసంగం ఆయన ప్రతిభను నిగ్గుతేల్చింది. పరిశోధన పరమార్థం తెలిసిన విద్వాంసుడాయన’ అని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రశంసించారు. ఆ నిరంతర రచనా వ్యాసంగం ద్వారానే శతకం, కావ్యం, గేయం, హరికథ, కథ, నవల, చరిత్ర రచన, జీవిత చరిత్ర, ఆత్మకథ, హరికథ, యాత్ర చరిత్ర…వంటి ఎన్నో ప్రక్రియల్ని పరిపుష్ఠం చేశారు. అంతేగాక 88 ఏండ్ల వయసులో ‘మన గ్రామనామాలు’ అనే పరిశోధనాత్మక వ్యాసం రాసి మెప్పించారు. సాహిత్యం, చరిత్ర కపిలవాయికి రెండు కండ్లు.అందుకే ఆయన సాహిత్య, చారిత్రక రచనలు కోకొల్లలు చేశారు.
కపిలవాయి నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో 1928 మార్చి 31న జన్మించారు. అతని తల్లిదండ్రులు మాణిక్యమ్మ, వెంకటాచలం. దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. బాల్యంలోనే తండ్రి మరణించడంతో తల్లితో కలిసి అమ్రాబాద్‌లోని మేనమామ చేవూరు పెద్ద లక్ష్మయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ గొప్ప పండితుడైన పెద్ద లక్ష్మయ్య వద్ద కులవృత్తితోపాటు సంస్కృత, తెలుగు సాహిత్యాలను ఔపోశన పట్టారు. విద్యాభ్యాసం తర్వాత నాగర్‌కర్నూల్ జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా 1954 జూలై 11న చేరారు.
1972లో పండరినాథ శతకం ప్రచురించారు. ఇదే కపిలవాయి ప్రథమ ముద్రిత గ్రంథం. సాహితీ భీష్ముడు కపిలవాయి ఎంత సంప్రదాయవాదో, అంతే సామాజిక స్పృహ ఉన్నవారు. సామాజిక స్పృహ అంటే ‘తత్కాల సామాజిక వాస్తవ పరిస్థితులను గుర్తించడం, అవగాహన చేసుకోవడం, సమా జం పరిణామ శీలాన్ని నిర్ద్వంద్వంగా అంగీకరించ డం యథాతథ స్థితి (స్టేటస్కో) వాదాన్ని దగ్గరకు చేరనియ్యకపోవడం, గత లోపాలను గుర్తించి వాటిని సర్దుకుంటూ నూతన యుగధర్మంగా రూపొందుతున్న దాని పక్షాన నిలవడం, దానికి సంబంధించిన కావ్య వస్తువులను ఎన్నుకొని, ఉచితమైన శైలిని రూపొందించుకొని కావ్య నిర్మా ణం చేయడం’ అని కుందుర్తి ఆంజనేయులు తెలిపారు.
కుటుంబ గీత, ప్రభోద పటహం, కపిలవాయి గేయ ఖండికలు. ఆయన రచనలకు పై నిర్వచనం సరిపోతుంది. భగవద్గీతను తలపించేలా ‘కుటుంబగీత’ అనే పేరును ఖరారు చేశారు కపిలవాయి. కుటుంబ గీత కావ్యంలో ‘ఆ కుటుంబయ్య యిల్లాలు అతివ మిన్న/పేరు సంతానలక్ష్మి…’ అంటూ (విషాదయోగం-1) ఆరంభమౌతుంది.
దీనిలో కవి ప్రస్తావించిన సైన్స్, సామాజికాంశాలు. రావే రావే యనుచు రాము కాలము నుండి/పిలుచు చందమామ నెలవుజేరె..( విజ్ఞాన యోగం-4) చందమామ రావె, జాబిల్లి రావే..పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు పాడేవారు. అలాంటి చందమామపై మొదటి అడుగువేశాడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. సైన్స్ పరిశోధనల వల్లనే అసాధ్యం సుసాధ్యమైంది. ఇలా కొన్ని విజ్ఞాన విషయాలను తెలిపారు కవి. భార్యాభర్తల గురించి ఇలా చెప్పారు.
‘ఆరు మూడైన మూడారునైన గాని సతి పతులు ముప్పదారుగా జనదెపుడును…’ఆరు మూడు కావడం కలహాలు, కష్టాలకు సంకేతం. మూడు ఆరవడం అంటే సుఖసంతోషాలకు నిదర్శనం. ఆలుమగలు ఎప్పుడూ 36లా ఎడమొహం పెడమొహంగా ఉండొద్దని, 67లా అన్యోన్యంగా ఉండాలని ప్రతీకాత్మకంగా హితోపదేశం చేశారు. ఒకసారి పల్లెల్లో అనురాగాలు, బంధుత్వాలు, ప్రకృతి శోభ, స్వచ్ఛత ఉండేది. కానీ ఇప్పుడున్న పల్లెల్లో పార్టీల కలహాలు, కుట్రలు, పెరిగి ప్రశాంతత తగ్గుతుందని హెచ్చరించారు. చీమ కాలంత గుర్తుతో సింహమంత/దొంగ యైనను భటులకు దొరికిపోవు…పోలీసు శాఖలోని ఆధునిక సాంకేతికతను ఆనాడే దర్శించారు కవి.
‘భువిని మానవసేవే మాధవుని సేవ..కోపమునకు మించు కొరివి’ అంటూ సరళమైన పదాలతో చైతన్యం కలిగించే సందేశమిచ్చారు. ఇందులో యువతీయువకులు, పెండ్లి, కుటుంబ నియంత్రణ సమాజ స్థితిగతులు ప్రధానంగా చిత్రితమయ్యాయి. కురుక్షేత్రంలో జరుగుతున్న గీతోపదేశ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినట్టు, కుటుంబ గీతను కృష్ణాచార్యునికి లక్ష్మయాచార్యుడు బోధించాడని రాయడం కపిలవాయి కల్పనాచాతుర్యానికి నిదర్శనం. ప్రముఖ సాహితీవేత్త తిరుమల రామచంద్ర ‘అధునాతన గీత’ పేరుతో కుటుంబ గీతకు విలువైన పీఠిక రాశారు. కపిలవాయి ‘ప్రబోధ పటహం’ గేయఖండికల్లో సమాజంలోని అనేకాంశాలు, వస్తువులను స్వీకరించి, చక్కని గేయాలుగా మలిచారు. ఇందులో దేశభక్తి, కార్మికులు, శ్రామికులు, జల సంరక్షణ, వరకట్న దురాచారం, మద్య నిషేధం, పొగ తాగడం, కులం, మతం, వాతావరణ పరిరక్షణ..మొదలైన సామాజిక అంశాలపై రాశారు కపిలవాయి. Smoking is injurious to health అని సిగరెట్ డబ్బాపై రాసి ఉన్నా సిగరెట్ తాగుతూనే ఉంటారు. తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. ఇతరుల ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తారు. అలాంటి వారికి ఊపిరితిత్తులు ఉసూరు మంటవి/గుండెకాయ గుబులెత్తుతది. తిన్నదరుగదని, ధూమపానం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు కవి వైద్యుడు.
మానవ జీవితంలో ప్లాస్టిక్ వస్తువు ప్రధాన భాగమైంది. దానిని వాడకూడదని కపిలవాయి ‘ప్లాస్టిక్ సంచి’ గేయంలో చెప్పిన తీరు బాగుంది. నేల తల్లికి మింగుడు పడదు/నీళ్ల లోపల చివికి పోదు..అంటూ కాల్చివేస్తే కాలుష్యం నిండిపోతుందని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల్ని ప్రజల భాషలో వివరించారు.
‘జాతీయ పతాకం’ కవితలో మూడు గుణాలది మన దేహం/మూడు మతాలది మన దేశం అంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మూడు మతాలు జెండాలోని రంగుల్లా దేశంలో కలిసిమెలిసి ఉండి మతసామరస్యాన్ని కాపాడాలంటారు కవి.
మన దేశీయ సంస్కృతి కదా! పరోపకారాయ ఫలంతి వృక్షాఃకాయలు, పండ్లు పరులకే అందిస్తాయని శ్లోకపాదం చెప్తుంది. అవి తినడం వల్ల ఆకలి తీరుతుందని, చెట్లను పెంచితే సకాలంలో వానలు వస్తాయని, పంటలు పుష్కలంగా పండుతాయని ‘వృక్షో రక్షతి రక్షితః’ కవితలో ప్రబోధించారు కపిలవాయి. చెట్టు పెరిగితే ప్రగతికి శోభ/చెట్టు నరికితే జగతికి క్షోభ ..అంటూ చెట్లను పెంచాలని, వాటిని నరకడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని ప్రజలకు హితవు పలికారు. కార్మికులే దేశాల ప్రగతికి, మానవజాతి మనుగడకు మూలం. ఆ కార్మికులు కోటలు కట్టారు. బాటలు వేశారని ‘కార్మికుడు’ కవితలో విశ్లేషించారు. ‘వాతావరణ పరిరక్షణ’ కవితలో ‘వ్యర్థ పదార్థాలను జీవనదుల్లో వదులును కర్మాగారాలు’.. అంటూ పారే నీళ్లలో, తాగు, సాగునీళ్లలో వ్యర్థపదార్థాలను పారవేస్తూ, మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని కవి వాపోయీరు. చెత్త వేసిన నరుడు వానరుడవుతాడని ఇంకో కవితలో చురక పెట్టారు. కులం, మతం గేయంలో వాల్మీకిది ఏ కులం..వ్యాసునిది ఏ కులం అంటూ కాళిదాసు, విదురుడు, సంజయుడు మొదలైన మహనీయుల కులమేమిటి? అని ప్రశ్నిస్తారు. కులం కంటే గుణం గొప్పది అని సందేశమిచ్చారు.
‘తాగుడు వాగుడు కవలపిల్లలు’ అనే అభివ్యక్తి బాగుంది. ఆరోగ్యం పాడవుతుందని, లొల్లులైతయని మద్య నిషేధం గేయంలో ప్రవచించారు. కపిలవాయి గేయఖండికలు, గ్రంథంలో పాలమూరు, సౌధశేఖరం, జీవిత చక్రం, ఊయెల మంచం గేయకవితలు ఉన్నాయి. జీవితచక్రం గేయఖండికలో బాల్య ఖండం, యవ్వన ఖండం, వ్యవహార ఖండం, వృద్ధ ఖండం నాలుగు దశలను వివరించారు.
సమాజంలోని దురాచారాలపై కవితా ఖడ్గం ఎత్తారు. తెలంగాణ ప్రాభవాన్ని ప్రస్తుతించారు. దేశభక్తిని ప్రబోధించారు. కపిలవాయి కవితాశైలి సరళసుందరంగా నదీప్రవాహంలా ఉంటుంది. శతాధిక గ్రంథకర్త కపిలవాయి ముద్రిత రచనలు 137. వీటిలో 16 ద్వితీయ ముద్రణ పొందాయి. ఆయన 320 పీఠికలు రాశారు. కపిలవాయి లింగమూర్తి సాహిత్య సృజనలో సహస్ర శీర్షులు, సహస్ర బాహూరుపాదులు. బహుముఖ ప్రజ్ఞాశాలి కపిలవాయి 2018 నవంబర్ 6న తుదిశ్వాస విడిచారు.
-ఎర్రోజు వేంకటేశ్వర్లు
9492557037