తెలంగాణ సాహితీమూర్తులు
అచ్చమైన తెలుగు పలుకుబడులను రాశులుగా పోసి కవిత్వం రాయడం ఆయన సొంతం. స్వచ్ఛమైన తెలంగాణ పల్లె తల్లి పదాల సోయగాలను పద్యాల్లో ప్రతిబింబించడం ఆయన ప్రత్యేకత. పాడిపంటల పచ్చదనం, పైరగాలుల వెచ్చదనం, కోడెగిత్తల గడుసుదనం, పల్లె పడుచుల అమాయకత్వం కవిత్వంలో పుష్కలంగా గుమ్మరించడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. ఆయన మరెవరో కాదు, రైతును రాముడిగా సృష్టించి, ఒక అపూర్వమైన కానుకను మనకందించిన మహాకవి వానమామలై జగన్నాథాచార్యులు.
జగన్నాథాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు 1908, డిసెంబర్ 19న జన్మించారు. ఈయన నైజాం పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. విద్యార్థి దశలోనే మహాభారతంలోని పద్యాలను కంఠస్థం చేశారు. చిన్న వయస్సులోనే పురాణ గ్రంథ పఠనం, హరికథాగానం చేసేవారు. అనేక కావ్యాలు, వ్యాకరణ, అలంకార శాస్ర్తాలను అధ్యయనం చేశారు. తండ్రి వద్ద ‘శబ్దమంజరి’ నేర్చుకున్నారు. సుమతి, దాశరథి శతకాలలోని పద్యాలను కంఠస్థం చేశారు. తెలుగు, సంస్కృత, తమిళ, ఉర్దూ భాషల్లో విశేషమైన కృషి చేసి చక్కని పాండిత్యం సంపాదించారు. ఈయన సుప్రసిద్ధ కవి ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులకు అగ్రజులు.
జగన్నాథాచార్యులది మధురమైన కంఠస్వరం. దాదాపు వెయ్యికిపైగా హరికథలు గానం చేశారు. ఈయన హరికథాగానం చేస్తుంటే శ్రోతలు ముగ్ధులై వినేవారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హరికథాగానం చేయడానికి వెళ్లారు. అప్పుడు అక్కడ తెలుగు వారి కన్నా హిందీ వారే అధికంగా ఉండటంతో తెలుగు హరికథలను అప్పటికప్పుడే హిందీలోకి అనువదించుకొని హిందీలో హరికథాగానం చేశారంటే ఆయన సమయస్ఫూర్తిని, మహోన్నత ప్రతిభా సంపత్తిని మనం అర్థం చేసుకోవచ్చు.
ధనుర్దాసు, కార్పాస లక్ష్మి, అభ్యుదయ గేయాలు, ఇల్లంతకుంట రఘురామ సుప్రభాతం, ఆదివరాహ అష్టోత్తరశతి, గణేశ స్తుతి, తెలుగు బిడ్డ శతకం, తులసి రామాయణం మొదలైన కావ్యా లు రాశారు. గోదాదేవి రచన అయిన ‘తిరుప్పావై’ని తమిళం నుంచి తెలుగులోకి ‘శ్రీ వ్రతగీతి’ అనే పేరుతో మధురమైన గేయాలుగా అనువదించారు.
తర్వాత జగన్నాథాచార్యులు కొన్నేండ్లు వ్యవసాయం చేశారు. రైతు పడే శ్రమను స్వయంగా అనుభవించి, రైతు వల్ల దేశానికి ఉన్న లాభాలను తెలియజేస్తూ 3,000 పద్యాలతో రైతు రామాయణం అనే మహాకావ్యాన్ని రాశారు. ఇది ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ కావ్యం వాల్మీకి మహర్షి రాసిన శ్రీమద్రామాయణాన్ని తలపించేలా అద్భుతమైన వర్ణనలతో ఉన్నది.
పల్లె ప్రాంతంలోని రైతు జీవిత కథను రామాయణంగా భావించి రైతు రామాయణం రాశారు. పాత్ర చిత్రణలోనూ, కథా సంవిధానంలోనూ అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించారు జగన్నాథాచార్య. శిశు, శిక్షణ, కల్యాణ, కృషి, నిర్బంధ, విజయ అనే ఆరుకాండలతో ఈ కావ్యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహాకవి దాశరథి, సినారె, కాళోజీ, పల్లా దుర్గయ్య, గోవిందవరం మురహరి శర్మ రాసిన పీఠికలు ఈ కావ్యానికి మరింత సొగసును అద్దాయి. చక్కని పద సౌందర్యంతో అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో పద్యాలు రాయడంలో మిక్కిలి నేర్పరి జగన్నాథాచార్యులు.
‘నా రెక్కలు చల్లగ ఉంటే
నా బక్కలు చల్లగ బతికుంటే
ఆ ఒక్కని దయ నాపై ఉంటే
ఏ రక్కసులున్నా ఏమవును
ఏ కుక్కలు తిన్నా ఏమవును’ అని రైతు ఆత్మవిశ్వాసాన్ని ఈ పద్యంలో అత్యంత సుందరంగా ఆవిష్కరించారు జగన్నాథాచార్య. అప్పటి ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావుకు ఈ కావ్యాన్ని అంకితం చేయడం వారి మధ్య గల అత్యంత సన్నిహిత సంబంధాన్ని వ్యక్తం చేస్తున్నది. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ ఈ పద్యాలను చదివి ఆయనను ఎంతగానో ప్రశంసించారు.
వీరి అసాధారణమైన ప్రతిభను గుర్తించి తెలుగు పద సాహిత్య సమితి, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణ సారస్వత పరిషత్తు, కళాభారతి మొదలైన అనేక సాహిత్య సంస్థలు ఘనంగా సత్కరించాయి. రైతు రామాయణాన్ని ‘మాండలిక పదకోశం’గా భావించి తెలుగు పద సాహిత్య సమితి, నెల్లూరు వారు ఆయనను రైతు వాల్మీకి బిరుదుతో సత్కరించారు. ఆయన సాహిత్య కృషికి తగినంత గుర్తింపు రాకపోవడం అత్యంత శోచనీయం.
‘పంట లక్ష్మికి తొలి యాటపట్టు
అది పెరటి కల్పకపు చెట్టు
పట్టణముల ఆయువుపట్టు పల్లెపట్టు
అదియె లేక నగర జీవి ఆటకట్టు’అని పల్లెటూరి సౌందర్యాన్ని అద్భుతమైన పదజాలంతో అభివర్ణించిన వానమామలై జగన్నాథాచార్యులు 1995, జూన్ 28న పరమపదించారు. అయినా తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిరంగా జీవించే ఉంటారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
94403 69939