దిష్టిబొమ్మల సమూహాలే
స్వరూపాల సారూప్యతల్లో
పడమటి సంధ్యకు ఒరుగుతున్న
నడివయస్సు జనుల గుంపులన్నీ!
బాన బొజ్జలతో
బరువైన హృదయాలతో
రాలిన జుట్టుతో
అలసిపోయిన కళ్ళతో
జారిన బాహువులతో
ఎండిన కన్నీటి చారలతో!
బ్రతుకుబండిని గమ్యానికి తోస్తూ
విశ్రాంతి లేక వడలి కొందరు
వారసుల పోషణలో మునిగి
వృత్తి ఒత్తిళ్ళతో నీరసించి
మరికొందరు!
జీవితంలో లోటు లేకపోయినా
లోటేదో ఉందని దీనంగా కొందరు
కొండంత సంపద సొంతమైనా
కోట్లేవో కూడబెట్టాలని తపనతో మరికొందరు!
అశేష అభిమానులున్నా
అవార్డులేవో కోరుకుంటూ కొందరు
మహాగొప్ప అధికారపీఠం దక్కినా
మరేదో ప్రైజ్ ఆశిస్తూ మరికొందరు!
కలల సాగుకు కాడిదించేసీ
ఓటమికి నిర్లిప్త రంగద్దుకొని కొందరు
ఆశయ సాధన దిశలో అలసినా
విజయానికై పోరాడుతూ
మరికొందరు!
వెరసి.
నడివయస్సు జనుల గుంపులన్నీ!
ఎండిన కన్నీటి చారలతో!
– రవి కిషోర్ పెంట్రాల లాంగ్లీ, లండన్