Genuine poetry can communicate before it is understood. – T.S.Eliot
కొమ్మవరపు విల్సన్రావు రాసిన ‘నాగలి కూడా ఆయుధమే’ కవిత్వ సంపుటి కోసం రాసి న ముందుమాటలో ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘కవి తనను తాను గుర్తెరగడమే కవిత్వం’ అంటా రు. తనను తాను ప్రేమించుకోలేని వాడు ఎదుటివాళ్లను ప్రేమించలేడన్నట్టు.. కవి అన్నవాడు ఎల్లప్పుడూ utmost self-consciousగా ఉంటూ సామాజిక మార్పులను, స్థితిగతులను పరిశీలిస్తూ, అందులో జరిగే సంఘటనలను తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ పాఠకులను ఆలోచింపజేయాలి. అలాంటి కవిత్వం రాయాలంటే సదరు కవి ఎంతో నిబద్ధతకలవాడై ఉండాలి. సరిగ్గా అలాంటి నిబద్ధత కలిగి కవిత్వాన్ని శ్వాసిస్తూ కవిత్వమే జీవితంగా Commitmentతో జీవిస్తున్న కొద్దిమంది సహృదయ తెలుగు కవుల్లో విల్సన్రావు ఒకరని ‘న్యాయనిర్ణేతవూ నీవే’ నుంచి ‘దేవుడు తప్పిపోయాడు’, ‘నాగలి కూడా ఆయుధమే’ వరకు ఆయన కవిత్వాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
‘నాగలి కూడా ఆయుధమే’ కవితల్లోకి వెళ్తే ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని పాఠకుని స్థాయిని బట్టి అందిస్తున్నదని చెప్పవచ్చు. ఈ సంపుటిలో కవితలన్నీ దేనికదే అచ్చుపోసినట్టు, ఎక్కడ కూడా అవసరం లేని పదాలను వాడినట్టు అనిపించదు. చిన్న చిన్న కవితల్లోనూ విశ్వజనీన విషయాలను అలవోకగా కవిత్వం చేశారు రచయిత విల్సన్. కవిత్వం అంటే ఏమిటి? కవిత్వం ఎలా ఉండాలి? కవిత్వమనే సృజన కళ గురించి ఇతర కవులు తమ కవిత్వాన్ని పదును పెట్టుకోవటానికి అవసరమైన కవితా సామగ్రిని తన కవిత్వం ద్వారా అందిస్తారు. కవుల కవిత్వం కష్టజీవుల చెక్కిళ్లమీంచి జారే కన్నీళ్లను తుడిచి నవ్వుల పరిమళం అద్దుతూ సాంత్వన ఇవ్వాలంటూ.. జీవితం పట్ల భరో సానిచ్చే కవిత్వం ఎలా ఉండాలో డిఫైన్ చేస్తాడు.
ఇద్దరు కలిసి కలబోసుకున్న కవి సమయాల్ని ఈ కవితలో ఇలా తలపోస్తాడు. ‘ఈ నడిరాతిరి నక్షత్ర జలపాత హోరులో/ నువ్వు నా కళ్లముందు రూపు కడుతున్నట్లు/ నాలో స్వచ్ఛ కన్నీటి చెమ్మకోసం/ నువ్వు ఎదురుచూస్తున్నట్లు కలకంటున్నాను’ అం టూ.. తన జీవితానికి ఎంతో భరోసానిచ్చి, అతిసున్నితంగా గుండెతడిని తడిమి ధిక్కార వ్యాకరణమైన సైదూ కవితా జలపాతాల్లో మునిగితేలుతూ తమ స్నేహతత్వాన్ని అజరామరం చేసే కవితనొక్కటి రాస్తానని ఆ జ్ఞాపకాల్ని నెమరేసుకుంటాడు.
ఇంత విలక్షణమైన కవిత్వనాగలితో సాహితీ సేద్యం చేస్తూ కవిత్వప్రియుల హృదయాల్లో నిలిచిపోయే కవిత్వాన్ని రాస్తున్న విల్సన్రావు ఇంకా తన కవిత్వ సృజనకు పదును పెడుతూ, అద్భుతమైన కవిత్వ సంపుటాలను వెలువరించాలి.
– డా.బి. శ్రీనివాసరావు 94404 71423