‘కప్పల కావడి’ ఓ జానపద కళారూపం. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ప్రాంతాలలో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రస్తుత గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ ప్రాంతాలు, కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతం తెలుగు రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాలలో కొన్ని చోట్ల అప్పటినుంచి ఇప్పటిదాకా కరువు కాటకాలతో అలమటించే ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో వాన రాక కోసం ఆబాలగోపాలం వరకు ఎదురుచూసేవారు. వాన దేవుడిని మెప్పించి రప్పించడానికి ఈ ప్రాంతాల్లో ఈ జానపద కళారూపం ప్రచారంలో ఉండేది. సకాలంలో వానలు కురవాలి. అలా కురవకపోతే నష్టం, అరిష్టం అనే వాదం వేదకాలం నుంచి నేటిదాకా వానల కోసం చేసే పూజలు, జరిపే తంతు, నడిపే సంబురాలు కోకొల్లలు.
తెలుగునాట గ్రామీణులు వాన దేవుడి రాక కోసం జరిపే ఆచారాలలో ఈ కప్పల కావిడి తంతు ఒకటి. వానకూ కప్పలకు లంకె ఉన్నది. వానలు పడితే చెరువులు నిండుతాయి. ‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు’ అని బద్దెన అన్నట్టు వాన వస్తే కప్పలు చెరువు నిండా చేరుతాయి, వాన వస్తే సరే, మరి వాన రాకపోతే? కప్పలను పురమాయించి వానలను తెప్పించాలి. అందుకే తెలుగు వారు వానల కోసం కప్పాలమ్మ కప్పల దేవర, కప్పతల్లీ సంబురాలు చేస్తారు. కప్ప తల్లికి పెళ్లి చేస్తారు. వరుణదేవుడు కప్పతల్లి పెళ్లికి కావిళ్లతో నీళ్లు పంపుతాడట. వాడలన్నీ నింపుతాడట. కప్పతల్లి గడప తొక్కితే శుభసూచకంగా భావిస్తారు పెద్దలు. కప్ప ఎగిరితే పొలంలో వానలు పడి బంగారం పండుతుందని రైతన్నల విశ్వాసం.
వర్షాలు సకాలంలో పడనప్పుడు ఆది హిందువులైన స్త్రీలు ఒక బోదురు కప్పను పట్టుకొని, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పసువు గుడ్డతో రోకలి మీద పెట్టి, కట్టి, ఒక కావడి భుజాన వేసుకొని రెండు తట్టల్లో కప్పలను పెట్టి అవి ఎగిరిపోకుండా వేప మండలు వేసి ఇద్దరు వక్తులు దాన్ని మోసుకొంటూ ఊరంతా తిప్పుతారు. వీళ్లవెంట కొందరు పేరంటాళ్ళు పళ్లెంలో పసుపూ, పువ్వులూ, పత్రీ పట్టుకుని కోలన్న పుల్లలతో వాయిస్తూ అందరూ ఒక్కసారిగా ఒక పాటను పాడుతారు.
literature news, Sahityamవానదేవుడా వానదేవుడా
వానలు కురిపించు వానదేవుడా
॥వాన॥
కప్పతల్లి నీళ్ళాడె
కడవల నిండనీళ్ళొచ్చె
మొర్రో వానదేవుడా
॥వాన
దోమ తల్లీ నీళ్ళాడే
దొరపుల నిండా నీళ్ళొచ్చె
మొర్రో వానదేవుడా
॥వాన॥
చేపతల్లీ నీళ్ళాడే
చెరువుల నిండా నీళ్ళొచ్చె
మొర్రో వానదేవుడా వాన
తూరుపున మొయిలు చుట్టి వానదేవుడా
తుంపరులు రావాలి వానదేవుడా
చిన్న చిన్న తుంపరలు వానదేవుడా
చెలరేగి కురవాలి వానదేవుడా
జడివాన రావాలి వానదేవుడా
సాగాలి కాలువలు వానదేవుడా
చెరువులన్ని నిండాలి వానదేవుడా
చేలన్నీ పండాలి వానదేవుడా
అందవయ్య దణ్ణాలు వానదేవుడా
అందరిని బతికించు వానదేవుడా…
ఇలా కప్పాలమ్మను పాట పాడుతూ ఊరేగిస్తూ చెరువు దగ్గరికి చేరుతారు. సంబురం చివర కప్పను చెరువులో వదలుతారు. నీళ్ళాడు అనే మాట
ప్రసవించడానికి జాతీయం. కప్పతల్లి ఒక్కత్తే కాదు ఆమెతో పాటు ఈగతల్లి, దోమతల్లి, చేప తల్లి, ప్రకృతి అంతా ప్రసవించాలని కోరుకుంటూ ఈ తంతు నిర్వహిస్తారని ఆరుద్ర (గుడిలో సెక్స్)లో పేర్కొన్నారు.
ఇలా కప్పల కావిడిలాగే వాన కోసం జానపదులు చేసే జాతరలు చాలా ఉన్నాయి. ఊరు ఊరంతా కలిసి వలస జాతర చేస్తారు. దీన్నే గంపజాతర, వరదపాసెం, వనభోజనం అంటారు. వాన కోసం ఊరు విడిచి అడివిలోకి వెళ్లాలి. అక్కడ వండుకొని తినాలి. ఈ జాతరలలో గాలి దేవరను, వలస దేవరను పూజిస్తారు. ఊరి బయట పరమాన్నం వండి, ఎత్తయిన ప్రదేశంలో వరుణ దేవున్ని అహ్వానం చేస్తూ ఈ పరమాన్నాన్ని ఒక బల్ల మీద వారపోస్తారు. దానిని దేవ ప్రసాదంగా ప్రతి వారూ తీసుకొని కళ్లకద్దుకొని తింటారు. దీనినే వరదపాశం అంటారు. వన భోజనంలో సాలదేవర్ని పూజిస్తారు. ఇలా రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలలో కొన్ని ప్రాంతాలలో కరువు సంభవించిన సమయంలో కానీ, వానకాలం ముందు కానీ ఇలాంటి కప్పల కావిడి జానపద కళారూపాన్ని ప్రదర్శించేవారు.
– కర్నె మల్లికార్జున్ 6303744239