బలిసినోల్లంత కలిసి
బక్కోడికి అన్యాయం సేత్తే…
దేవుడు వేటెయ్యకపోయినా కర్మ కాటేత్తది…
పేదోడి గుడిసెపైన పెద్దోడి సూపు పడితే
గడ్డీ గాండివం కాకపోయినా
కాలం పుైల్లె గుచ్చుతది…
ఎదుటి వాడికి అండ లేదని
గండం సేత్తానంటే,
గాలి సుడిగుండమై సుట్టేసి సూపిత్తది…
బలహీనుడినీ, బలంకల్లోడు
భయమై బాధ పెడితే
కంటినీరే సెరువై బలం కాళ్ళను కుదిపేత్తది…
రాత రాసినోడు అన్నాయాన్నీ
సూత్తూ ఊరుకున్న
గీత గీసినోడు పట్టనట్టు పండుకున్నా
క్షణం ఎంటాడి ఏటెత్తది…
తప్పు సేసే ఆళ్ళని
మనిసి తప్పని సెప్పపోయినా,
తప్పును కప్పిపుచ్చినా
కాలం గడ్డపారై తవ్వేత్తది
తప్పును బయటకి తీత్తది…
ఎవడినో సెడగొడుతున్నననీ
సెడ్డ ఆలోసనలతో నువ్వుంటే…
సమయం అడ్డీతో కలిపి
పానానికే ఎసరు తెత్తది…
కాళ్లు, రెక్కలున్నయని
కన్నోళ్లకు కూడు పెట్టకపోతే…
నీ నడక పడకేసినప్పుడు,
పెయ్యి బువ్వకే ఏడ్తది…
వొల్లు గట్టిగున్నదని వట్టిగా మురిసిపోతే…
మురుపం కొన్నిరోజులే అని
ముసలితనం సూపిత్తది…
సితికిన బతుకులకు అన్నాయం సేత్తనంటే…
మనిసి తోడు నడవకున్నా,
నాయం నీడై నడుత్తది…
క్షణంల సావత్తది, గడియల మంటత్తది,
గంటల బూడిదత్తది.
పెయ్యి బొక్కైతది.
కలిపితే గంగలా, లేకుంటే మట్టిలా…