మడిని,ధాన్యపు
ఒడిగా మార్చేందుకు
నాగలి కర్రు భూమి పొరలతో చేతులు కలిపినది నేడు,
మట్టి గట్టితనాన్ని
తట్టి నలిపి
జీవశక్తిగా మార్చేలా
ఎద్దుల గిట్టలు
తాండవమాడిన రోజిది,
రైతు భగీరథుడై
తెచ్చిన
నీళ్ళధార
ప్రాణదాతై
నేలకు ఊరినింపినది నేడు,
మనిషి మనుగడకై
తపస్సు చేసి మన్ను,
గింజకు అన్నానికి మధ్య
మధ్యవర్తిత్వం వహించిన దినమిది,
ఆకాశంలోని చంద్రుడు
పున్నమి రూపం దాల్చి
భూమిని కలువ చేసి
ముద్దాడిన రోజిది,
నోరుదాక అన్నం పుట్టే
ఏరువాక పున్నమి నేడు,
ఈ రాత్రి
నేను,
చంద్రునిలో నిండైన రైతుని
చూస్తున్నాను!!
డాక్టర్
కాసర్ల నరేశ్రావు 94414 06252