పూలకుప్పగా మట్టి సుగందాలలో
పుట్టింది బతుకమ్మ..
పూలతల్లిగా ఆదిపరాశక్తికి పూజలు..
ఊరువాడు పూలవనం
ఎంగిలిపూల బతుకమ్మతో
మొదలాయే సంబూరం
ఆడబిడ్డల ఆటలు పాటలు
ఆనందం ఆరోగ్యం
విజ్ఞానం సుజ్ఞానం
పుట్టింటి మమకారం
అన్నదమ్ముల అనురాగం
తాంబాల మంచుల్లో తంగేడుపై..
మెత్తని రంగుపూల వరుసలు
ఎన్ని తీరులో బతుకమ్మలు..
పసుపు ముద్ద గౌరమ్మ
రోజుకో తీరు పలారాలు
ఆడబిడ్డలెత్తుకోంగా
సాకపెట్టి
వాకిట్లో దింపితే..
సింగిడినే గోపురంగా చుట్టినట్టు..
చుట్టూ ఓ నాలుగు సుట్లు తిరిగినంక..
అలికి ముగ్గు పెట్టిన
అనువు తావులకి
అన్ని బతుకమ్మలు
పసుపు పారాణి
కడియాలు పట్టీలు
పాదాలు పూసి అడుగుల సవ్వళ్లు
వన్నెల కోకలు
వెన్నెల కొంగులు
తళుకు తరంగాల చీరకుచ్చిళ్లు
నెలవంకలై నెలతలు
భుజము భుజము కలిపి
చప్పట్ల దరువులతో
గుండ్రంగా తిరిగేటి
సంగీత సాహిత్య నాట్యకళలు
ఎంత సహజ సుందరమో!
పౌరాణికాలు చారిత్రకాలు
సామాజికాలు
వీర శౌర్యగాథలు
త్యాగాల పాటలు
మన బంగారు బతుకమ్మ
సింగారమై
లోకమంతా
మనసు పూల పాటలు
‘పోయిరా మా తల్లి గౌరమ్మ వచ్చే ఏడాదికి మళ్ళీ రావమ్మా’
సద్దుల బతుకమ్మ నాడు
సాగనంపేటి పాటలు
చెరువు కట్టమీద ఆటలు
గుర్తుకొచ్చే జ్ఞాపకాలు
ఇచ్చి పుచ్చుకునే
వాయనాలు
బాల్యమంతా యాదికొస్తది
నాడు భుజాలకెక్కిన బతుకమ్మ
నేడు దోసిట్లోకొచ్చింది
చెరువు అలల్లో
ఊయలూగిన తల్లి
జలసిరుల లేమిలో
నలుగుతున్నది
తడవలేక కదలలేక
దాండియా గర్భ డీజేల హోరు
దేహమంతా
దుమ్ము దూళిమయం
పాట కోయిలలు పారిపోతున్నవి
వంత చిలకలు మూగబోతున్నవి
సంప్రదాయక వైభవం
ప్రాకృతిక సౌందర్యం
పవిత్రంగా కొలిచే దైవత్వం..
మారిపోతుందనే
పెద్ద తరం తీరును పోరును..
పట్టించుకోవడమే
తెలియకున్నదేమో ఈ తరానికి
మార్పులు చేర్పులకు
స్వాగతమే.. కానీ,
మన చరిత్ర తెలియాలిగా
తెలంగాణ బతుకమ్మది
పోరాటాల గాథ
బతుకమ్మ ఆత్మకథ
మనందరి కథ
బతుకమ్మ ప్రకృతి కావ్యం
-గడ్డం సులోచన
7702891559