తనువుకు వేషం
వేయగలవేమో కానీ
మనసుకు వేయలేవు
అది రూపం లేకున్నా..
లోకానికి కనబడుతూనే ఉంటుంది
పగబట్టినోడు
నవ్వుకుంటనే తన వ్యూహం మొదలుపెడతాడు
ఆ పగ పొగ పసిగట్టడంలో
తెలంగాణ బిడ్డలు మషూర్
ఎన్ని వేషాలేసినా
ఎంతమంది వేషగాళ్లను
పురమాయించిన
ఆడ మగ అని తేడా లేకుండా
ద్వేషం రగిలించేందుకు
ఎంతమందిని ఉసిగొలిపినా
కర్రు కాల్చి వాత పెట్టడం
సమయం సందర్భం వచ్చినప్పుడు
తప్పకుండా రుచి చూపిస్తరు
స్వాములను స్కామ్లలో
తిప్పినంత సులభం కాదు
పదే పదే ఈ మట్టిని మోసగించడం
నడుస్తున్న కాళ్ళ నడుమ కట్టె బెట్టినట్లు
లాభాల బాటలో ఉన్న దేశం షాన్లను,
నిషాన్లను అమ్మడమే
అభివృద్ధి అని నమ్మించినట్లు కాదు
అభూత కల్పనలతో
మా ప్రజలకు పాలకులకు మధ్య
పేగుబంధం తెంచడం
తెలంగాణ గడ్డమీద అడుగు పెట్టి
తెలంగాణ ఆత్మను అతలాకుతలం చేసి
మంత్రగాడిలెక్క సీసాలోకి దట్టించాలనే
కుయుక్తులకు కాలం చెల్లింది
తేలు కుట్టిన దొంగలు
భుజాలు తడుముకునే చోరులు
నిజాలను ఎన్నడో గ్రహించే ఉంటారు
జనం ముందు ఒప్పుకోవడానికి
ధైర్యం కూడగట్టుకోవడానికి
జన్మంతా ఎదురుచూసినా సరిపోదు
ఇక్కడి ప్రజలంతా
కడదాకా కొట్లాడే సిపాయిలే
నిజాములను.. భూస్వాములను…
నిన్నమొన్నటి పెట్టుబడిదారులను
మా సిపాయితనం గురించి అడిగితే
రామాయణం రాసిన వాల్మీకులై
భారతం రాసిన వ్యాసులై
కళ్లకు గట్టిస్తారు
మీరూ తెలంగాణ వీర గాథలను
నిత్యం స్మరించే రోజు దగ్గర్లోనే ఉంది
మీ పాపాలకు విముక్తి
అంతే దూరంలో ఉంది..
– ఘనపురం దేవేందర్
99480 32705