రాలిన పూలన్నీ
జ్ఞాపకాలై వికసిస్తాయి
స్మరించినప్పుడల్లా
పరిమళాలై చుట్టుముడుతాయి!
త్యాగాలెన్నటికీ
గాలిలో కలిసిపోవు
అవసరమొచ్చినప్పుడల్లా
స్ఫూర్తిని రాజేస్తాయి!
విభజన రేఖల మధ్య
గాంధీ మంత్రోపదేశమై మొలుస్తాడు
రఘుపతి రాఘవ రాజారాం
ఈశ్వర్ అల్లా తేరేనామ్!
ఉల్లంఘనలకు తెర లేచినప్పుడల్లా
రాజ్యాంగమై చూపుడు వేలెత్తి
అంబేద్కర్ ప్రశ్నిస్తూ
యోధులకు ఆయుధాన్నిస్తాడు!
దేహమా? దేశమా?
నిలదీసినప్పుడు భగత్‌సింగ్
ఉరితాడును ముద్దాడిన దృశ్యం
సూర్యోదయాలను ప్రభావితం చేస్తుంది!
వీరులు మరణించి
మనలో జీవిస్తారు
కాలానుగుణంగా మనకు
కర్తవ్య బోధ చేస్తుంటారు!
వ్యక్తమయ్యే దేశభక్తి
అత్యంత ప్రమాదకరం
అవ్యక్త దేశభక్తులు
కలంతో ఆయుధంతో
కాపలా కాస్తుంటారు!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261