నింగిన చేరిన నీలిమబ్బు
నీటి చుక్కైరాలగానే..
పరిమళించే మట్టి మహత్తు
మనిషికి నేర్పే పాఠం మరుజన్మకైనా మరువనిది..
అమావాస్య చీకటైనా
నిండు పున్నమి వెలుతురైనా
సాగర మథనాన్ని గుర్తుచేస్తూ..
కదిలిన కలలు అలలుగా
అంతర్మథనాన్ని ఆవహించిన క్షణం
అణువణువు ఆనందమయం..
హోరున వీచే గాలి
జలజల జారే జలపాతం
ఎంతకీ అందని నింగీనేలల
లోతు ఎప్పటికీ అద్భుతమే..
ఆకాశాన వికసించే సప్తవర్ణసింగిడి సాక్షిగా..
ఎండుటాకులు రాలిన చోట
మొలిచిన లేలేత చిగుళ్లలో
తీరొక్కపూల సోయగమంతా
సింధూరపు వాకిలిని చూస్తూ ఎదగాల్సిందే..
పురివిప్పి ఆడే నెమలి
అందంగా అల్లిన పిచ్చుక గూళ్ళు..
కొండ కోనల్లో జుంటి తేనె తియ్యదనం
ఊర పిచ్చుకల కిలకిలలు
కోటి తారకల వెలుగులు..
ఒక్కటేమిటి..
తల్లి గర్భంలో శిశువు
పురుడోసుకున్న నవ చైతన్యమంతా
ప్రకృతి వికసితలే కదా..
– శ్రీలత రమేశ్ గోస్కుల, హుజూరాబాద్