సోలెడు గింజల కోసం పొద్దంతా
కండలు కరిగించే గరీబోళ్ళ గుండెలపై
ఉరుములు లేకుండానే పిడుగులు పడ్డట్టు..
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు..
మునుగోడు జనాలపై మధ్యంతర
ఎలచ్చన్ల పటాస్ పేలింది.
మూలకేసిన ప్రచార రథాలు సడుగెక్కినయ్
రంగుల జెండాలన్నీ కర్రల మొనలపై
ఏలాడుతూ ఓటర్ల ఎదకు తాకుతున్నయ్
ఇచ్చిన హామీలను ఇండస్‌లో కలిపేసి
కొత్త పల్లవిలను రాసుకొని పాడుకుంటూ
గంజి బట్టలు, బెంజి బండ్లు గల్లిగల్లీ తిరుగుతూ
తాయిలాల మత్తును జనాలపై జల్లుతున్నయ్
కరెన్సీ కట్టలకు రెక్కలొచ్చి
ఓటును తరాజులో వేసి జోకుతున్నయ్
సుక్కకు నిషా ఎక్కువై ఆబ్కారీ ఆందాన్
చరిత్ర పాదుల్లోకి ఎక్కుతున్నది
మేక, కోడి తలలు తెగిపడి ముద్ద పక్కన
ముక్క ముచ్చటగా గొంతులో దిగుతున్నది
పేర్చుకున్న కరెన్సీ గుట్టలను కరగదీస్తూ
ఓటుకు నోటును ఎరగా వేస్తూ
యథేచ్ఛగా ఎన్నికలకు తూట్లు పొడుస్తున్రు
అభివృద్ధిని అడవిలో వదిలేసిన ఏలికలు
దూషణల పరిమళాలను వెదజల్లుకుంటూ
రాజకీయ ఉన్నతిని బజారులో నిలబెడుతున్నరు
అనవసర ఎలెచ్చన్లతో ప్రజాసొమ్మును
డస్ట్‌బిన్‌లోకి ఒంపుతున్నారు
ప్రతీ ఓటరూ చైతన్య కిరణమై వెలగాలి
నోటుకు, చెప్పే మాటలకు మోసపోవద్దు
ప్రలోభాల మూసీనదిలో మునిగిపోవద్దు
మంచి నేతకు పట్టం గట్టాలి
ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి..
తాటిపాముల రమేష్
79815 66031