బండ మాటల దిగజారుడులో, జారిపోతూ
ఏ వైభవాల అంతస్తుల్ని నిర్మించగలవు?
అనైతిక ముసుగులోంచి వచ్చి,
విసిరిన సవాల్‌తో నాయక ధీర కాలేవు
ఓర్చుకోలేని బలిదానాల హాహాకారాలకు
కన్నీరొడ్పని ముఖచిత్రం
నీ మొఖాన్ని రాజచిత్రంగా చెక్కగలదనే
మూర్ఖపు నమ్మికవు
చీకటి రోజుల చేతిలో పడి,
ఉషోదయాలకు దూరమైనవు
ప్రసంగాల అరుపులు,
తొడగొట్టు చప్పుళ్ళతో
కామెడీల వంటకం భలే అదిరిస్తున్నవు
ఆత్మకొక కండువా చొప్పున
ఎన్ని వేషాలకు సిద్ధమవుతవు?
కుర్చీయే ఏకైక లక్ష్యమైతే
రాజకీయం సన్యసించాలె
మొట్టమొదట జనం గోసల్ని
రెట్టపై దట్టీ గట్టి, తడిమిన దాఖలాలేవీ?
చెరువులు పరవళ్ళు తొక్కినా
నీ వొంటికి సల్లంటక పోవడం
ఆశ్చర్యాల కెల్ల వింత
లొల్లులు లేని విశ్వనగరిలో
కల్లబొల్లి కబుర్ల విల్లంబులేమి దూస్తవు?
‘జొన్న కొయ్యలా ప్రశ్న’నని సంబురపడుతుంటవు
నీ చిత్తశుద్ధికి, నిజాయితీకి కూడా నీవే ప్రశ్నవు
రేసులో, కిక్కిరిసిన నావలో ప్రయాణిస్తున్నవు
గెలుపూ, కల
విహారాన్ని ఆపి,
నిన్ను నేలపైకి దింపవు
అలలైతే జనసముద్రం పోటుకు
నువ్వూ, నీ నావా గల్లంతే
నీ అవాంఛిత కాంక్షా చెలిమి
తెలంగాణ సైసది!
– సుబోధిక్