దూసినంత మేర
నీ నవ్వు మాత్రమే
దేహపు పురవీధుల్లో నెత్తుటి అడుగులు వేస్తూ
హృదయానికి
ఎన్ని గాట్ల బహుమతో
పదునైన నవ్వు యే క్షమా లేకుండా
రెండు వైపులా సమానమైన త్రాసులా ఊగుతూ
కళ్లకింది నీటిపొరల్లో ముంచి తీసిన నవ్వు
కొత్త చరిత్ర పులుముకుని మిలమిలా మెరుస్తుంటే
మనసుని ఏ రాజ్యాంగపు వేర్ల కింద దాచాలో తెలియలేదు
అడుగు అడుగు కింద
మెత్తగా అదే నవ్వు
ప్రతి పాదముద్ర ప్రశ్నగా మారుతుందనీ
కొత్తగా పుట్టుకొచ్చిన నక్షత్ర
పువ్వై సమాధానం చెబుతూ
ఈ రాత్రి
ఏ గాలి వీచినా అదే నవ్వు
అమ్మ కడుపున ఉమ్మనీరై చుట్టుకుంటుంటే
దేహమంతా మాయతెగని మాంసపు ముద్దలా
వెచ్చబడింది
రేపు అనేది ఉందో లేదో
ఒక నవ్వును నాలోకి దూయండి
కన్నీటి హిమగిరిని నిలువునా చీల్చి
తేటపడ్డ కళ్ళతో కాలానికి ముద్దుపెట్టి
పంజరాన్ని విడిచే పక్షినై ఎగిరిపోతాను
మెర్సీ మార్గరెట్
90528 09952