నేను కళ్ళు మూసుకొని
నిశ్శబ్దంగా పాట వింటున్నాను
చల్లని సితార నన్ను తాకి
వెళుతూనే ఉన్నది
నిజం ఎంత సత్యమో
అబద్ధం అంతే అసత్యం!
నేను చిన్నపుడు
కాకులు పాడుతుంటే విన్నాను
పాత పాటల నడకలు
తడబడి పోతున్నాయి
వసంత రుతువులో కూయాల్సిన కోకిల
ఎందుకో ముందుగానే కూస్తుంది!
మట్టిలో కలిసే క్షణాన కూడా
పాటను ప్రేమిస్తాను
మా ఇంటి ముందర ఉన్న
నల్ల తుమ్మ, చింత చెట్టు
వేప చెట్టు, కంపతారి చెట్టు
నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాయి!
ఒంటరితనం అంగవైకల్యం లాంటిదే
ఎవరితో మాట్లాడలేం
వెలుగుల్నీ చూడలేం
విజయం కోసం యజ్ఞం కన్న
మనిషి విలువల కోసం చేసే పోరాటం
కాలానికి గీటురాయి!
నాకు పాట నేర్చుకోవాలని ఉన్నది
బడిలోను సభలోను
పిల్లల నుంచి ప్రజల నుంచి
చరిత్ర ప్రతి నాగేటి చాలు నుంచీ
నాకు పాటల కంకుల్ని
ఏరుకోవాలని ఉన్నది!
పాట లేకపోతే
ఇన్నాళ్లు మనసులో దాగిన
మర్మాన్ని ఎట్లా చెప్పను
ఎవరైనా పాడితే విని
మళ్ళీ పాటలు నేర్చుకోవాలని ఉన్నది
పాట పోగొట్టుకుంటే
మనిషికింకేం మిగుల్తుంది!!
ఎదిరెపల్లి కాశన్న
96400 06304